కుళాయి.. లేదోయి..!

Amruth Scheme Delayed In West Godavari - Sakshi

ఉచిత కుళాయి పథకానికి నిబంధనల మెలిక

‘అమృత్‌’ పట్టణాల్లో పేదలకు చేరని వైనం

ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన మున్సిపల్‌ కౌన్సిలర్లు

స్పందన అంతంతమాత్రం

భీమవరం టౌన్‌: అమృత్‌ పథకం అమలులో ఉన్న పురపాలక సంఘాల్లో పేదరికానికి దిగువన ఉన్న వారికి ఉచితంగా కుళాయి కనెక్షన్‌ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్య తరగతి వర్గాలు కుళాయి కనెక్షన్‌కు ఒకేసారి సొమ్ము చెల్లించలేని పక్షంలో 8 వాయిదాలుగా చెల్లించవచ్చని కూడా ప్రకటించింది. గతంలో దివంగతనేత వైఎస్‌ హయాంలో ప్రకటించిన  పేదలకు రూ.200కు కుళాయి కనెక్షన్‌ పథకం అమలులో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కుళాయి కనెక్షన్‌ ఉచితమని అందుకు అవసరమైన రోడ్డు కటింగ్, పైప్‌లైన్‌ అన్ని ఖర్చులను పురపాలక సంఘాలు భరిస్తాయని ప్రకటించింది. రూ.200 కూడా చెల్లించనవసరం లేకుండా, అన్ని ఖర్చులతో కలిపి ఉచితంగా కుళాయి కనెక్షన్‌ అందిస్తున్నామని అధికారపక్ష నాయకులు గొప్పగానే చెప్పుకున్నారు.

దిమ్మతిరుగుతున్న షరతులు
ఉచిత కుళాయి కనెక్షన్‌ అంటూనే కొన్ని నియమనిబంధనలు కూడా ప్రభుత్వం విధించింది. జీఓ ఎంఎస్‌ నం.159 ది.17–05–2018 తేదీ మున్సి పల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఉత్తర్వులు పరిశీలిస్తే ఇంటి పన్ను ఏడాదికి రూ.500 తక్కువ ఉన్న పేదలకు మాత్రమే ఉచిత కుళాయి కనెక్షన్‌ లభిస్తుంది. దీంతో నిరుపేదలకు ఉచితంగా కుళాయి దక్కుతుందో లేదో అర్థంకాని పరిస్థితి. పట్టణాల్లో గతంలోనే ఇంటి పన్నులు భారీగా పెంచారు. రూ.500లోపు అర్థసంవత్సరానికే అధిక శాతం మందికి పన్ను వస్తుంది. ఇక ఏడాదికి రూ.500 అంటే ఉచిత కుళాయి గగనంగానే కనిపిస్తోంది.

ప్రభుత్వం దృష్టికి..
భీమవరం మున్సిపల్‌ కౌన్సిలర్లు ఉచిత కుళాయి కనెక్షన్‌లో ఉన్న నిబంధనలు  పేదలకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు కౌన్సిల్‌ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణాల్లో ఇంటి పన్ను అధికంగానే ఉందని అలాంటి సమయంలో పేదలు ఉచిత కుళాయి పొందాలంటే ఏడాదికి రూ.500లోపే ఇంటి పన్ను కలిగి ఉండాలన్న నిబంధన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ఇంటి పన్ను ఏడాదికి రూ.1,000 చెల్లించాలన్న నిబంధన ఉంటే పేదలకు న్యాయం జరుగుతుందని కోరారు. దీనిపై గత రెండు సమావేశాలుగా పురపాలక అధ్యక్షుడు కె.గోవిందరావు, వైస్‌ చైర్మన్‌ ముదునూరి సూర్యనారాయణరాజు, కమిషనర్‌ సీహెచ్‌ నాగనర్సింహరావు, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ప్రకటించారు.

ప్రభుత్వ స్పందన కరువు
ఇప్పటివరకూ ఈ జీఓలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఆరు నెలలకే రూ.500 ఇంటి పన్ను చెల్లించే పేదలకు గతంలో రూ.200కే కుళాయి కనెక్షన్‌ దక్కేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఏడాదికి రూ.500 ఇంటి పన్ను నిబంధన తొలగించి ఇప్పుడు అమలు జరుగుతున్న విధంగానే రూ.200కే కుళాయి కనెక్షన్‌ ఇచ్చి రోడ్డు కటింగ్‌ చార్జీలను కూడా పురపాలక సంఘాలే ఉచితంగా భరిస్తే బాగుంటుందని కౌన్సిలర్లు సూచిస్తున్నారు.  

వైఎస్‌ హయాం నుంచి ఇప్పటి వరకూ..
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమాని ఇప్పటివరకూ తెల్ల రేషన్‌కార్డు కలిగి ఆరు నెలలకే రూ.500 లోపు పన్ను చెల్లించే పేదలందరికీ రూ.200కే కుళాయి కనెక్షన్‌ మంజూరు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్‌ నిమిత్తం రోడ్డు కటింగ్‌ చార్జీలు కూడా పురపాలక సంఘాలే భరించాలని అప్పట్లో వైఎస్సార్‌ ఆదేశించారు. అయితే ఆర్థిక సమస్యలతో ఉన్న పురపాలక సంఘాలు రోడ్డు కటింగ్‌ చార్జీలు భరించలేమని చెప్పాయి. ఆ తర్వాత వైఎస్‌ ప్రభుత్వమే మున్సిపల్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించే వరం ప్రకటించింది. అయినా పురపాలకులు కుళాయి కనెక్షన్‌ నిమిత్తం రోడ్డు కటింగ్‌ చార్జీలను పేదలపైనే భారం మోపారు. ఏడాదికి రూ.1,000 పన్ను చెల్లించే పేదలు, మధ్యతరగతి కుటుంబాలు కూడా రూ.200కే కుళాయి కనెక్షన్‌ పొందేగలిగే అవకాశం ఏర్పడింది. కాని ఇప్పటి ప్రభుత్వం ఏడాదికి రూ.500 ఇంటి పన్ను చెల్లించేవారికి మాత్రమే ఉచిత కుళాయి అని చెప్పడం వలన చాలా మందికి ఈ అవకాశం దక్కేలా కనిపించడం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top