ఎయిర్‌పోర్టు కేంద్రంగా అఘాయిత్యాలు | airport is centre for crimes | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు కేంద్రంగా అఘాయిత్యాలు

Jan 31 2014 5:56 AM | Updated on Mar 28 2018 10:59 AM

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకున్న ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మహిళలను కిడ్నాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

 శంషాబాద్, న్యూస్‌లైన్:
 శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకున్న ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మహిళలను కిడ్నాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పటి వరకు ఈ ఘటనలు వెలుగులోకి రాలేదు. అయితే ఈనెల 24న ఎయిర్‌పోర్టు ఉద్యోగినిని ఈ ముఠా కిడ్నాప్ చేసింది. లైంగికదాడికి యత్నించగా కుక్కలు అరవడంతో ఆమెను వదిలి పారిపోయారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుండగుల పాపాలు పండాయి. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు ఆ ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి క్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఎస్‌ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డితో కలిసి నిందితుల వివరాలు మీడియాకు తెలిపారు.
 
     రంగారెడ్డిజిల్లా తుక్కుగూడకు చెందిన కారు డ్రైవర్ పి.జగన్ (26) మూడేళ్ల క్రితం రెండెకరాల భూమిని విక్రయించగా రూ.30 లక్షలు వచ్చాయి.ఈ డబ్బులో కొంత ఖర్చు చేసి చెల్లెలి పెళ్లి చేశాడు. మిగతా డబ్బుతో క్యాబ్ (ఏపీ ఏపీ29టీవీ5844) కొన్నాడు. ఇందులో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులను ఎక్కించుకొని.. వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు.  
 
     ఈ క్రమంలోనే ఇతనికి కర్మన్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ టి.శ్రీనివాస్ (31)తో పరిచయం ఏర్పడింది. రాత్రి వేళల్లో ఇద్దరూ విమానాశ్రయం వద్ద కాపుకాస్తున్నారు.  ఒంటరిగా ఉన్న మహిళను లిఫ్ట్ ఇస్తామని క్యాబ్‌లో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నారు.  ఒక్కోసారి బాధిత మహిళకు డబ్బు ఇచ్చి పంపిస్తున్న వీరు.. మరికొందరు బాధితుల వద్ద ఉన్న బ్యాగ్‌లోని సొత్తును దోచుకుంటున్నారు.
 
     ఇలా ఈ ముఠా రెండేళ్లుగా అఘాయిత్యాలకు పాల్పడుతోంది. బాధితులెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఎయిర్‌పోర్టులో విధులు ముగించుకుని రాత్రి 7.30కి ప్రధాన గేటు ముందు నిల్చున్న మహిళ (30)ను లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని తొండుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ జగన్ ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోని కుక్కలు ఐదు నిమిషాల పాటు భౌ..భౌ.. భౌమని అరవడంతో భయపడ్డ నిందితులు ఆమెను కారులోంచి బయటకు తోసి పారిపోయారు.
 
     మరుసటి రోజు బాధితురాలు ఆర్‌జీఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌ఓటీ, ఆర్‌జీఐ  ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్, పుష్పన్‌కుమార్, దుర్గాప్రసాద్, ఎస్‌ఐలు నాగరాజు, మహేష్‌గౌడ్, శ్రీకాంత్‌లు రంగంలోకి దిగారు.
 
 ఇలా పట్టుబడ్డారు...
     విమానాశ్రయం ప్రధాన గేటు నుంచి తొండుపల్లి వరకు ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు ఆగిపోయింది. అయితే, పోలీసులు క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన, వారి వ్యక్తిగత వివరాలపై ఆరా తీయగా.. జగన్, శ్రీనివాస్‌లపై అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈనెల 24న మహిళను తామే కిడ్నాప్ చేశామని అంగీకరించారు.
 
     జగన్ ఇంట్లో పోలీసులు సోదా చేయగా రెండు లేడీస్ బ్యాగ్‌లు దొరికాయి. ఒక బ్యాగ్ 24న కిడ్నాప్ చేసిన మహిళది కాగా.. మరో బ్యాగ్ గతేడాది డిసెంబర్ 16న  తాము కిడ్నాప్ చేసిన మరో మహిళదని నిందితులు వెల్లడించారు.
 
     దీంతో పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారించగా ఇప్పటి వరకు నాలుగైదు నేరాలకు పాల్పడ్డామని తెలిపారు.  తొండుపల్లి, శంషాబాద్, మంకాల్, షాపూర్ గ్రామ శివార్లకు మహిళలను తీసుకెళ్లే వారమని చెప్పారు.
 
     అయితే వీరి చేతికి చిక్కిన బాధితులు ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. నిందితులకు కూడా వారి వివరాలు తెలియదు. బాధితులెవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాకపోవడంతో నిందితులిద్దరూ ఇంకెన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
 ఇప్పటికైనా బాధితులు ముందుకొచ్చి  ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు. బాధితుల్లో విమాన ప్రయాణికులు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement