అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.
అనంతపురం స్పోర్ట్స్ : అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించారు. రఘువీరా కాంప్లెక్స్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీలో ‘ఎయిడ్స్ నియంత్రణ సామాజిక బాధ్యత’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంతో మంది యువత ఎయిడ్స్ మహమ్మారికి బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో దాన్ని నివారించవచ్చన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎయిడ్స్‌ను పారదోలేందుకు పది నిమిషాలు చర్చించేలా చర్యలు తీసుకుంటామని, సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిని సామాజిక స్పృహతో ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. వారి పట్ల వివక్ష చూపకుండా అందరిలాగే చూడాలన్నారు. తెలిసో తెలియకో ఎయిడ్స్ బారిన పడిన వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయొద్దని సూచిం చారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌ను తరిమికొట్టే దిశగా ఆరోగ్యశాఖ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
డీఎంహెచ్‌ఓ ప్రభుదాస్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. హెచ్‌ఐవీ బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మదమంచి స్వరూప, అనంత నెట్ వర్క్ ఆఫ్ పాజిటివ్స్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు.