హార్సిలీహిల్స్‌పై అడ్వెంచర్‌ ఫెస్టివల్‌   

Adventure Festival on Horsley Hills - Sakshi

సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు 

నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహణ

అన్ని ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ  

బి.కొత్తకోట(చిత్తూరుజిల్లా): రాష్ట్రంలో అరకు తర్వాత అత్యంత శీతల ప్రదేశంగా పేరుపొందిన హార్సిలీహిల్స్‌ సాహస ఉత్సవాలకు సంసిద్ధమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీహిల్స్‌లో చరిత్రలో మొట్టమొదటిసారిగా అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా సాహస క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఉత్సవాల నిర్వహణ కోసం జిల్లా అధికారులు వారం రోజులుగా శ్రమించారు. పోటీల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఫుడ్‌ స్టాళ్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలను అలరించేలా ఉత్సాహభరితమైన కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. సినీ నేపథ్య గాయకులు, హాస్య నటులు కార్యక్రమాలతో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై పండగ సందడి నెలకొంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. 

సాహస క్రీడా పోటీలు ఇలా.. 
ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 9 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో 3 కిలోమీటర్ల సైక్లింగ్, 3 కిలోమీటర్ల రన్నింగ్, అడవిలో 3 కిలోమీటర్ల నడక పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వందమందికిపైగా పాల్గొంటారని అంచనా. ఇవికాకుండా కొండపైన హీట్‌ బెలూన్స్, రోప్‌ సైకిలింగ్, జిప్‌ సైకిల్, ఎయిర్‌ బెలూన్స్, సర్వైవల్‌ క్యాంప్, ట్రెక్కింగ్, రాక్‌ క్లైంబింగ్, బైక్‌ రైడింగ్‌ పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తారు. ఉత్సవాలకు హాజరయ్యే క్రీడాకారులు, యాత్రికుల కోసం కొండపై 50 టెంట్లు సిద్ధం చేశారు. 

నాటి ఏనుగు మల్లమ్మ కొండే నేటి హార్సిలీహిల్స్‌! 
ఆహ్లాదకర వాతావరణంతో హార్సిలీహిల్స్‌ పర్యాటకుల మనస్సు దోస్తూ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది. దీన్ని బ్రిటీష్‌ పాలనలో 1850లలో చిత్తూరు–కడప జిల్లాల కలెక్టర్‌ డబ్ల్యూడీ హార్సిలీ కనుగొన్నారు. దీంతో ఏనుగు మల్లమ్మ కొండగా పిలువబడుతున్న ఈ కొండ హార్సిలీహిల్స్‌గా మారింది. అత్యంత చల్లటి హార్సిలీహిల్స్‌లో 2000 సంవత్సరం నుంచి పర్యాటక శాఖ కార్యకలాపాలు ప్రారంభించడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. వేసవి విడిదిగా పర్యాటకులను ఆకర్షిస్తూ మంచి ఆదాయం గడిస్తోంది. హార్సిలీహిల్స్‌ను సాహస క్రీడలకు కేంద్రంగా నిలపడం ద్వారా మరింతమంది పర్యాటకులను ఆకర్షించాలని భావించిన పర్యాటక శాఖ ఇందులో భాగంగా తొలిసారిగా అడ్వెంచర్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఉత్సవాల నిర్వహణ కోసం రూ.కోటి నిధులను వినియోగిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top