కల్తీ మద్యం స్వాధీనం | Adulterated liquor seized | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యం స్వాధీనం

Sep 11 2014 2:10 AM | Updated on Sep 2 2017 1:10 PM

కల్తీ మద్యం స్వాధీనం

కల్తీ మద్యం స్వాధీనం

ప్రొద్దుటూరులో కల్తీ మద్యం రాజ్యమేలుతోందనడానికి నిదర్శనంగా బుధవారం చోటుచేసుకున్న సంఘటనే చెప్పుకోవచ్చు. చేసేది నీతి మాలిన పనే అయినా షాపులోనే దర్జాగా చేయడం చూస్తుంటే వారి వెనుక

ప్రొద్దుటూరులో కల్తీ మద్యం రాజ్యమేలుతోందనడానికి నిదర్శనంగా బుధవారం చోటుచేసుకున్న సంఘటనే చెప్పుకోవచ్చు. చేసేది నీతి మాలిన పనే అయినా షాపులోనే దర్జాగా చేయడం చూస్తుంటే వారి వెనుక ఎంత పెద్ద నాయకులున్నారో ఊహించుకోవచ్చు. స్థానిక మద్యం దుకాణాదారుల్లో కొందరు మద్యంలో నీళ్లు కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. స్థానిక రామేశ్వరం రోడ్డులోని మానస వైన్ షాపులో బుధవారం మద్యం సీసాల్లో నీళ్లు కలుపుతున్న నలుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 144 నీళ్లు కలిపిన మద్యం సీసాలు, 14 లీటర్లు లూజు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
 ప్రొద్దుటూరు క్రైం:
 రామేశ్వరం రోడ్డులోని మానస వైన్‌షాపులో మద్యం కల్తీ జరుగుతోందని సమాచారం రావడంతోనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) శంభూప్రసాద్ స్థానిక ఎక్సైజ్ సీఐలు, ఎస్‌ఐలకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే రంగంలోకి దిగారు. మానస వైన్ షాపునకు రోడ్డు వైపున, పర్మిట్ రూం వైపున వేర్వేరుగా షెట్టర్‌లు ఉన్నాయి. పర్మిట్ రూం వైపున ఉన్న షెట్టర్ తెరచి నలుగురు వ్యక్తులు బుధవారం ఉదయం 7.30గంటలకే లోపలికి వెళ్లగా బయట తాళం వేశారు.  షాపు వద్దకు వచ్చిన ఈఎస్ షెట్టర్ తెరవమని ఎంత చెప్పినప్పటికీ వారు తెరవలేదు. కొంత సేపటికి అక్కడికి వచ్చిన నిర్వాహకులు తాళం లేదంటూ కుంటి సాకులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈఎస్ గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో షాపు తెరిచారు. ఈఎస్ ఆదేశాల మేరకు అప్పటికే ఎక్సైజ్ సీఐ రంగారెడ్డి, ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. షాపు సెట్టర్‌లు తెరవగానే మద్యంలో నీళ్లు కలుపుతున్న రామేశ్వరానికి చెందిన రవికుమార్, సుబ్బరాయుడు, ఈశ్వరెడ్డినగర్‌కు చెందిన శివ, ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసాల నుంచి తీసిన మద్యాన్ని బిందెలో స్టాకు పెట్టారు. సుమారు సగం బిందె వరకూ ఉన్న మద్యంతో పాటు నీళ్లు కలిపిన 144 సీసాల కల్తీ మద్యం, సీసాల మూతలు తీయడానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులతో పాటు మద్యం సీసాలను ఈఎస్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మద్యం షాపు తమ ఆధీనంలో ఉందన్నారు. గతంలో కూడా మానస వైన్‌షాపుపై పలు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ షాపును ఖచ్చితంగా మూసేస్తామన్నారు. ఈ కేసులో దాదాపు రూ.ల క్షకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపి, షాపు నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
 ఈఎస్‌కు ప్రశంశల వెల్లువ
 కల్తీ మద్యం జరుగుతున్న వైనాన్ని బయటపెట్టిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్‌ను ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా ఒక్కరే వెళ్లి  నిందితులను పట్టుకోవడంతో పలువురు రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు అభినందించినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఉదయం నుంచి అధికార పార్టీ  నాయకుల నుంచి ఎక్సైజ్ అధికారులకు పెద్ద ఎత్తున ఫోన్‌లు వచ్చినట్లు తెలిసింది. కల్తీ విషయం బహిర్గతం కావడంతో మిగతా షాపుల నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే బుధవారం 10 గంటల నుంచి మానస వైన్ షాపును తెరిచి అమ్మకాలు జరపడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement