కేరాఫ్ కోడూరు! | Adangal duplicate copies still for sale | Sakshi
Sakshi News home page

కేరాఫ్ కోడూరు!

Oct 29 2013 2:18 AM | Updated on Sep 2 2017 12:04 AM

పొలం ఉండీ పాస్ పుస్తకం కావాలంటే ఎంత లేదన్నా రెండు నెలల సమయం కావాలి.. అలాంటిది సెంటు భూమి లేకపోయినా ఫర్వాలేదు పైసలిస్తేచాలు...

చల్లపల్లి, న్యూస్‌లైన్ : పొలం ఉండీ పాస్ పుస్తకం కావాలంటే ఎంత లేదన్నా రెండు నెలల సమయం కావాలి.. అలాంటిది సెంటు భూమి లేకపోయినా ఫర్వాలేదు పైసలిస్తేచాలు రెండు రోజుల్లో పాస్‌పుస్తకాలు మీ చేతిలో ఉండాలంటే కోడూరు వెళ్లండి.. నకిలీ పాస్‌పుస్తకాలు పుట్టించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాకు కోడూరు కేంద్రంగా పనిచేస్తుండటమే దీనికి కారణం.
 
రైతుల సర్వే నంబర్లు సేకరించి...

 కొంతమంది రైతుల సర్వే నంబర్లను సేకరించి వాటి ద్వారా కోరుకున్న ప్రాంతంలో ఎంత కావాలంటే అంత పొలానికి నకిలీ పాస్‌పుస్తకాలను ఇక్కడ విక్రయిస్తున్నట్టు సమాచారం. మీసేవా కేంద్రాలకు, తహశీల్దార్ కార్యాలయానికి సంబంధం లేకుండా ఈ ముఠా నకిలీ పుస్తకాలను రూపొందించి విక్రయిస్తున్నట్టు తెలిసింది. పంట పొలాలు లేకపోయినా బ్యాంకులో రుణాలు పొందాలనుకునేవారి ఆశను ఈ ముఠా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. పాస్ పుస్తకం కావాలంటే గతంలో ఆ ప్రాంతంలో సేకరించిన సర్వే నంబర్లు కొన్నింటితో ఈ పుస్తకాలు తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కో పాస్ పుస్తకాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు నకిలీ అడంగల్ కాపీలను ఈ ముఠా విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో అడంగల్‌కు రూ.400 నుంచి రూ.500 తీసుకుంటున్నట్టు సమాచారం. వీటితో పలు బ్యాంకుల్లో అక్రమంగా రుణాలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
 
రూ.30 లక్షల అక్రమ రుణాలు...

కోడూరులోని ఓ బ్యాంకులో ఓ రైతు రుణం పొందేందుకు వెళ్లగా ఈ అక్రమ పాస్‌బుక్‌ల బాగోతం బయటపడినట్టు తెలిసింది. అప్పటికే ఆ సర్వే నంబర్‌తో మరొకరు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు పొందారనే విషయం తెలియడంతో ఆ రైతు విస్తుపోయారు. ఈ విధంగా సదరు బ్యాంకు నుంచి రూ.30 లక్షల వరకు అక్రమంగా రుణాలు పొందినట్టు తెలిసింది. సిబ్బంది కూడా కమీషన్లకు కక్కుర్తిపడి వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. విషయం వెలుగులోకి రావడంతో బ్యాంకు అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్నట్టు తెలిసింది.
 
ఇతర ప్రాంతాల్లోనూ...

కోడూరుతో పాటు మొవ్వ, పామర్రు మండలాల్లోని పలు బ్యాంకుల్లోనూ ఈ ప్రాంత వాసులు అక్రమ రుణాలు పొందినట్టు సమాచారం. గత ఏడాది ఇలా అక్రమ పాస్‌బుక్‌ల ద్వారా రుణాలు పొందిన విషయం బయటకు రాగా ఇప్పటి వరకు వారి నుంచి రుణాలు రికవరీ చేసిన దాఖలాలు లేవు. సామాన్య రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష ప్రశ్నలు సంధించే బ్యాంకు అధికారులు నకిలీ పుస్తకాలకు ఎలా రుణాలిస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement