అభీబస్‌ ఆఫర్‌ పై ఆగ్రహజ్వాల | ABHI BUS APP PASINGERS FAIR IN VIZAJANAGARAM | Sakshi
Sakshi News home page

అభీబస్‌ ఆఫర్‌ పై ఆగ్రహజ్వాల

Feb 24 2017 8:00 PM | Updated on Sep 5 2017 4:30 AM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు

► భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు
► మార్కెటింగ్‌ కోసమేనంటున్న ఆర్టీసీ
► ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన సంస్థకు  అప్పగించడంపై ఆందోళన
► మూడు రెట్ల ఆదాయం ఇస్తామని ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ డొక్కు బస్సులతో సాధ్యమా..?
► ఆర్టీసీ కార్మిక సంఘాల నిరసన గళం
 
విజయనగరం అర్బన్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఆన్‌లైన్‌ పాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌(ఓఆర్‌ఎస్‌)ఏజెంట్‌గా అభీబస్‌ సంస్థను ఎంపిక చేయడంపై కార్మికలోకం భగ్గమంటోంది.
 
సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి
మార్చి 1 నుంచి అన్ని బస్‌స్టేషన్ల కరెంట్, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ ప్రక్రియను అభీబస్‌ చేపట్టబోతోందంటూ ఆర్టీసీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్వహణ బాగోలేదని తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిషేధించిన అభీబస్‌  సంస్థకు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్, ఈస్ట్‌ కోస్ట్‌ (నెక్‌) రీజియల్‌ పరిధిలోని తొమ్మిది డిపోల వద్ద ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. 
 
ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. సంస్థ తీరులో మార్పురాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దశాబ్దకాలంగా ఆర్టీసీ ఆన్‌లైన్‌   పాసింజర్‌ రిజర్వేషన్‌ విధానాన్ని చేపడుతోంది. ఈ విధానంలో భాగంగా అధీకృత ఏజెంట్లను నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అధీకృత ఏజెంట్లతో పాటు బస్‌స్టేషన్లలో ఆర్టీసీ సొంతంగా కరెంట్, అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ కౌంటర్లు నడుపుతోంది. ఆర్టీసీ రీజియన్‌లోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా వీటికి అదనంగా అభీబస్‌ సంస్థను ఆర్టీసీ తన ఏజంట్‌గా నియమించింది. ఈ సంస్థకు బస్‌స్టేషన్లలో బుకింగ్‌ కౌంటర్స్‌ను అప్పగించింది.
 
ఆర్టీసీ సాఫ్ట్‌వేర్‌ అంతా అభీబస్‌ సంస్థ ఆధీనంలోకి వెళ్లబోతోంది. ఆర్టీసీ ఏసీ బస్సుకు రూ.7, ఆర్టినరీ బస్సుకు రూ.5 చొప్పున అభీబస్‌ సంస్థకు కమిషన్‌ చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల రిజర్వేషన్‌ కేంద్రాలను అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. విస్తృత  రవాణా నెట్‌వర్క్‌ కలిగిన అభీబస్‌... ఆర్టీసీ ఏజంట్‌గా చేరడం  వల్ల సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు ప్రాచుర్యం పొందుతాయని, ఆదాయం సమకూరుతుందని, ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, సంస్థను అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకున్నారని, ఉపాధిని దెబ్బతీసేందుకు పెద్దలు కుట్రపన్నుతున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement