రైల్లో రెచ్చిపోయిన పోకిరీలు

రైల్లో రెచ్చిపోయిన పోకిరీలు


సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌పై అసభ్య ప్రవర్తన

భరించలేక నడుస్తున్న ట్రైన్‌ నుంచి దూకేసిన యువతి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో ఘటన




ఒంగోలు క్రైం/రైల్వేస్టేషన్‌ (విజయవాడ): పట్టపగలు.. పదుల సంఖ్యలో జనం చూస్తుం డగానే రైలులో ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పట్ల కొందరు పోకిరీలు అఘాయిత్యం చేయబోయారు. సూటిపోటి మాటలు.. వెకిలి చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించే సరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది. పెళ్లి చూపుల కోసం వెళ్తుండగా ఊహించని రీతిలో ఇలా వేధింపులు ఎదురయ్యేసరికి షాక్‌కు గురైంది. వారి చేతిలో అవమానం పాలయ్యే కంటే చావడం నయం అనుకుని నడుస్తున్న రైలు లోంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో గాయపడ్డ యువతిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.



ఈ ఘటన రైళ్లలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు.. విజయవాడ పెజ్జోనిపేటలో నివాసం ఉంటున్న షేక్‌ నజ్‌బుల్లా (21)తో పాటు విజయవాడకే చెందిన సీహెచ్‌ వాసవీ, మంగళగిరికి చెందిన ఎస్‌కె ఆరీఫాలు చెన్నైలోని రెడ్డింగ్‌ టన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ట్రైనీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీ ర్లుగా పనిచేస్తున్నారు. నజ్‌బుల్లాకు గురువారం విజయవాడలో పెళ్లి చూపులున్నాయి. దానికి తోడు 2వ తేదీన బక్రీద్‌ పర్వదినం కావడంతో సెలవుపై విజయవాడకు బయల్దేరింది. ఆమెతోపాటు వాసవీ, ఆరీఫాలు కూడా బయల్దేరారు. వాస్తవానికి విజయవాడ వెళ్ళేం దుకు బుధవారం సాయంత్రమే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు ముగ్గురు రిజర్వేషన్‌ చేయించుకు న్నారు.



 కానీ, చెన్నై సెంట్రల్‌కు వచ్చేసరికి రైలు వెళ్లిపోవడంతో తిరిగి గురువారం ఉదయం 10 గంటలకు చెన్నై సెంట్రల్‌లో మిలీనియం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. రైలు ప్రయాణించిన గంట తర్వాత అదే బోగీలో ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు అసభ్య పదజాలంతో వేధింపులు ప్రారం భించారు. తోటి ప్రయాణికులు ఎన్నిసార్లు వారించినా వారు ఆగకపోవడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. దీంతో బోగీలోని చైన్‌ లాగేందుకు నజ్‌బుల్లా చేసిన ప్రయత్నాలనూ ముష్కరులు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆ బోగీలోకి టికెట్‌ కలెక్టర్‌గానీ, పోలీసులుగానీ రాలేదు. మధ్యాహ్నం 2.10గంటలకు సింగరాయకొండ స్టేషన్‌లో రైలు నెమ్మదించడంతో బాధితురాలు ఒక్కసారిగా తలుపు తీసుకుని దూకేసింది. వెంటనే ఆమె స్నేహితులు చైన్‌ లాగి రైలును ఆపారు. ఈ సంఘటనలో నజ్‌బుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్టేషన్‌ మాస్టర్‌ 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆమెను ఒంగోలు రిమ్స్‌కు పంపిం చారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పా రు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు రైల్వే జీఆర్‌పీ ఎస్సై టి.రమణయ్య నజ్‌బుల్లాను వివరాలు అడిగి తెలుసుకున్నారు.



మద్యం తాగుతూ వికృతచేష్టలు..

ఒంగోలులోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు నజ్‌బుల్లా వెంట ఉన్న యువతులు రాత్రి 11 గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆకతాయిలు దాదాపు పది మంది ఉన్నారని, మద్యం తాగుతూ గుట్కాలు నములుతూ అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు. నజ్‌బుల్లాపై చేయి కూడా చేసుకున్నారని, వారి వికృత చేష్టలకు భయపడి ఎవరూ వారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీ కూడా తమ కంపార్ట్‌మెంట్‌కు రాలేదని చెప్పారు. ఇలావుండగా సంఘటన నేపథ్యంలో టీసీని రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం అందింది.



విజయవాడలో నిందితులు అదుపులోకి

ముగ్గురు నిందితులను విజయవాడ రైల్వే జీఆర్‌పీ పోలీసులు గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షామిలీ జిల్లాకు చెందిన కుర్బ మహ్మద్‌ (22), సదాకత్‌ఖాన్‌ (40), హరికేష్‌ యాదవ్‌ (25)లుగా గుర్తిం చారు. షామిలీ జిల్లా నేరస్తులకు అడ్డా కావడం గమనార్హం.

 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top