పసుపు రైతు విలాపం | A few farmers in the hopes of competing against the price | Sakshi
Sakshi News home page

పసుపు రైతు విలాపం

Oct 21 2013 3:37 AM | Updated on Sep 1 2017 11:49 PM

పసుపు ధర కొన్నేళ్లు బంగారంతో పోటీపడి రైతుల్లో ఆశలు చిగురింపజేసింది. నాలుగేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.17 వేలు పలికింది. చాలా మంది రైతులు ఈ పంటసాగువైపు మొగ్గు చూపారు.

జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : పసుపు ధర కొన్నేళ్లు బంగారంతో పోటీపడి రైతుల్లో ఆశలు చిగురింపజేసింది. నాలుగేళ్ల క్రితం క్వింటాల్‌కు రూ.17 వేలు పలికింది. చాలా మంది రైతులు ఈ పంటసాగువైపు మొగ్గు చూపారు.
 
 ఫలి తంగా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ, ఆనాటి ధరలు ఎప్పుడూ లభించడం లేదు సరికదా... రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. మరుసటి ఏడాది క్వింటాల్‌కు రూ.10 వేలు అనంతరం రూ.5 వేలకు పడిపోయాయి. దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ధర పెరగకపోతుందా? అనే ఆశతో జిల్లాలోని చాలా మంది రైతులు పసుపులో తేమ లేకుండా చేసి, కోల్డ్‌స్టోరేజీలతోపాటు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అయినా వారికి ఫలితం దక్కేలా లేదు. సీజన్‌లో క్వింటాల్‌కు రూ.7 నుంచి రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.4 నుంచి రూ.6 వేల మధ్య కదలాడుతూ రైతులను నిరాశలో ముంచుతోంది.
 
 జిల్లాలో 70 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతోంది. ఒక్కో ఎకరాకు రూ.70 వేల వరకు పెట్టుబడి అవుతోంది. కోళ్ల, పశువుల ఎరువు పోయించడంతోపాటు విత్తనాలు, కూలీల ఖర్చు పెరగడంతో పెట్టుబడి భారీగా పెరిగింది. జిల్లాలో గతేడాది అక్కడక్కడా పంటకు తెగుళ్లు సోకినప్పటికీ చాలా చోట్ల ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా (పచ్చి పసుపు) దిగుబడి వచ్చింది. పసుపును సుగంధ ద్రవ్యాల్లో, రంగుల పరిశ్రమలో విపరీతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, అంతర్జాతీయుంగా డిమాండ్ లేదనే సాకుతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.
 
 3 లక్షల బస్తాల నిల్వలు
 సీజన్‌లో రేటు లేకపోవడంతో జిల్లాలోని రైతులు 3 లక్షల బస్తాల పసుపు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ఒక్కో బస్తా 80 కిలోల నుంచి క్వింటాల్ వరకు ఉంటుంది. పండిన పసుపు అమ్ముడుపోకపోవడంతో రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండడంతో రబీ సీజన్‌కు సైతం మళ్లీ కొత్తగా అప్పు చేసే పరిస్థితి.
 
 పెద్ద రైతులే కాకుండా చిన్న రైతులు సైతం ధర పెరగకపోతుందా అని నిల్వ చేయడంతో చేతిలో డబ్బులు లేక నెట్టుకువస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్, సారంగాపూర్ మండలం అర్పపల్లి, రాయికల్ మండలం ఇటిక్యాల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ధర్మారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో రైతుల వద్ద భారీగా పసుపు నిల్వలు ఉన్నాయి. రైతులకు తోడు వ్యాపారులు కూడా భారీగానే పసుపు ఉత్పత్తులు నిల్వ చేశారు.
 
 మరో రెండు నెలల్లో ఈ సీజన్‌లో వేసిన పసుపు పంట చేతికి అందే అవకాశం ఉండడంతో... గతేడాది పంట నిల్వ ఉన్న రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నేరుగా మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని ఇరోడ్ మార్కెట్లో పసుపు విక్రయించుకుందామనుకున్నా ధర రూ.5 నుంచి రూ.6 వేల మధ్యలోనే ఉండడంతో ఏం చేయాలా? అని తలలు పట్టుకుంటున్నారు. పసుపు మద్దతు ధర పెంచాలని రైతులు స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యలో కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలుస్తున్నప్పటికీ ప్రయోజనం కలగడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement