
సాక్షి, చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 60వ రోజు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో శుక్రవారం ముగిసింది. రామచంద్రాపురం మండలం పాత వేపకుప్పం నుంచి ఉదయం ప్రారంభమైన యాత్ర ఎల్వీపురం క్రాస్ రోడ్డు, నెత్తికుప్పం, తిమ్మరాజుపల్లి, బొల్లెపల్లి, సి.కాలేపల్లి, చిట్టత్తూరు, చిట్టత్తూరు హరిజనవాడ మీదుగా రాయలచెరువు శివారు వరకు కొనసాగింది.
సీఎం చ్రంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. ఇక సీఎం సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు జన నేతకు బ్రహ్మ రథం పట్టారు. ఈరోజు ఆయన 11.8 కిలోమీటర్లు నడిచారు. జగన్ ఇప్పటివరకు మొత్తం 830 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.
వేలూరులోని శ్రీపురం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరపగా కుంకుమ, తీర్థం, ప్రసాదాన్ని జగన్‌కు ఆలయ పౌర సంబంధాల అధికారి కల్యాణ్ అందజేశారు. తిమ్మరాజుపల్లి హరిజనవాడ మీదుగా ఎన్‌ఆర్ కమ్మపల్లి చేరుకున్న జగన్ పొలాల్లో రైతులతో ముచ్చటించారు. చంద్రబాబు అనే రైతుకు పొలంలో మినీ ట్రాక్టర్ నడిపి ఆయన వరి నాట్లు వేశారు. గ్రామ యువత జగన్‌ను కలిసి పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కుప్పం బాదుర్ శివారు చేరుకుని శుక్రవారం నాటి యాత్రను ముగించారు.