30 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత | 30 KG Gold biscuits Seized At Narayanapuram Toll Plaza | Sakshi
Sakshi News home page

30 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత

Mar 13 2019 9:27 AM | Updated on Mar 13 2019 9:43 AM

30 KG Gold biscuits Seized At Narayanapuram Toll Plaza - Sakshi

స్వాధీనం చేసుకున్న గోల్డ్‌ బిస్కెట్లతో ఎస్పీ

విశాఖ నుంచి విజయవాడకు కారులో తరలిస్తున్న 30 కిలోల బంగారు బిస్కెట్లను పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు.

ఏలూరు టౌన్‌: విశాఖ నుంచి విజయవాడకు కారులో తరలిస్తున్న 30 కిలోల బంగారు బిస్కెట్లను పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.10 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నామని.. ఇందులో భాగంగా ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్‌ప్లాజా వద్ద గణపవరం సీఐ రామ్‌కుమార్, చేబ్రోలు ఎస్‌ఐ, రెవెన్యూ అధికారులతో కూడిన ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, స్టాటిక్‌ సర్వీలెన్స్‌ టీమ్‌.. వాహనాల తనిఖీలు చేపట్టాయన్నారు.

ఈ సమయంలో విశాఖ నుంచి వస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తి కారును ఆపి తనిఖీ చేయగా.. 30 కిలోల బరువున్న 300 బంగారు బిస్కెట్లు లభించాయని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తిస్థాయిలో పత్రాలు లేవని, జిరాక్స్‌ కాపీలు మాత్రమే ఉండటంతో.. ఆ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందన్నారు. బంగారు బిస్కెట్లను ఇన్‌కంట్యాక్స్‌ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. వారు పత్రాలను తనిఖీ చేసిన అనంతరం అన్నీ సక్రమంగా ఉంటే వారికే అప్పగిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరావు, ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కాగా, తాను అన్ని అనుమతులతోనే బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నానని సత్యనారాయణ చెప్పారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌వీబీసీ గోల్డ్‌ షాపు నుంచి విజయవాడలోని తమ బ్రాంచ్‌కు వీటిని తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement