చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

3 Boys Ate Rats Poison One Boy Died In West Godavari - Sakshi

సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి): బుట్టాయగూడెం మండలం రాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పట్టెం గౌతమి కుమారుడు అభిచరణ్‌తేజ ఆదివారం రాత్రి చాక్లెట్‌ అనుకుని ఎలుకలమందు తినుకుంటూ వచ్చి గ్రామంలోని మరో ఇద్దరు బాలలు కట్టం సంతోష్, మడకం రాహుల్‌లకు ఇచ్చాడు. వారు కూడా చాక్లెట్‌గానే భావించి తిన్నారు. తిన్న కొద్దిసేపటికి వాంతులు కావడంతో ముగ్గురూ అపస్మారక స్థితికి వెళ్లారు. బాలలను గమనించిన వారి కుటుంబ సభ్యులు, స్థానికులు వైద్యం కోసం బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అభిచరణ్‌ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ అభిచరణ్‌తేజ (5) మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు బాలలు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. 

అభిచరణ్‌తేజ మృతిపై అనుమానాలు
అభిచరణ్‌తేజ మృతిపై అతని తాత, నాన్నమ్మలు, తండ్రి కుమార్‌ రాజాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ మృతిపై తల్లిపైనే తమకు అనుమానం ఉందని ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా గౌతమి, కుమార్‌ రాజాలు మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారని వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ కోర్టులో కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు. మృతిపై పోలీసులకు తాత కృష్ణ, నాన్నమ్మ రామలక్ష్మిలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఫిర్యాదు అందుకున్న స్థానిక ఎస్సై కె.నాగరాజు రాయిగూడెం గ్రామానికి వెళ్లి సంఘటనకు సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో గౌతమి ఇంట్లో మంచం కింద ఉన్న ఎలుకల మందు ప్యాకెట్‌ను పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం ఎస్సై ఏలూరు వెళ్లి అభిచరణ్‌తేజ మృతికి సంబంధించి పోస్టుమార్టం అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలుకల మందు తినడం వల్ల అభిచరణ్‌తేజ మృతి చెందినట్లు భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top