నేడు, రేపు తిరుపతి బంద్ | 28th,29th Bandh called in Tirupati | Sakshi
Sakshi News home page

నేడు, రేపు తిరుపతి బంద్

Aug 28 2013 4:23 AM | Updated on Sep 1 2017 10:10 PM

సమైక్యాంధ్ర సాధనలో భాగంగా నేడు, రేపు తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధనలో భాగంగా నేడు, రేపు తిరుపతి బంద్‌కు స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం మబ్బు చెంగారెడ్డి ఆధ్వర్యంలో టౌన్‌క్లబ్‌లో అన్ని ఉద్యోగ, స్వచ్ఛంద సంస్థల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. బుధ, గురువారాల్లో బంద్‌ను ఏవిధంగా నిర్వహించాలన్నదానిపై సుదీర్ఘం గా చర్చించారు. అనంతరం ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ రాజశేఖర్‌బాబు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో గంటపాటు సమావేశం అయ్యారు.
 
 అనంతరం కలెక్టర్, ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తిరుపతికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా బంద్ నుంచి యాత్రికులు, భక్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు దాదాపు 2 లక్షల మంది దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారని వారికి ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. రైల్వే స్టేషన్ నుంచి తిరుమలకు వె ళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ 10 ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంద్ నేపధ్యంలో నగరంలో టీటీడీ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు ఆహారపొట్లాలు ఉచితంగా సరఫరా చేయనున్నారు.  
 
శాంతియుతంగానే బంద్
రాజకీయాలకు అతీతంగా 48 స్వచ్ఛంద, ఉద్యోగ సంఘాలతో రెండు రోజులబంద్ చేస్తున్నామని మబ్బు చెంగారెడ్డి తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు 500 మంది చొప్పున నగరంలో మొత్తం 20 బృందాలతో రౌండ్‌ద క్లాక్ పద్ధతిలో బంద్‌ను పర్యవేక్షిస్తారన్నారు. నగరంలో ద్విచక్ర వాహనాలు మినహా ఆటో, రిక్షా, జీపు, ట్యాక్సీలు, లారీలు తిరగవన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల జోలికి వెళ్లేది లేదన్నారు. బెంగళూరు మార్గం నుంచి ఎవరైనా తిరుమలకు వెళ్లాలంటే బైపాస్ మీదుగా చెర్లోపల్లె, జూపార్కు మీదుగా అలిపిరికి, ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వారు కరకంబాడి మీదుగా లీలామహల్, కపిలతీర్థం అలిపిరి వరకు చేరుకోవచ్చన్నారు. పాలు, మెడికల్ షాపులతో పాటు హాస్పిటల్ సేవలు మినహాయింపు ఉంటుందన్నారు. తిరుపతి, తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే వారు వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్, పెళ్లి కార్డుతోపాటు, పెళ్లికొడుకు,పెళ్లికూతురు ఫొటోలు అతికించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement