జిల్లాలో 2 లక్షల 84 వేల 509 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తోందని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు.
విజయవాడ సెంట్రల్ : జిల్లాలో 2 లక్షల 84 వేల 509 మంది రైతులకు రుణమాఫీ వర్తిస్తోందని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. బుధవారం సాయంత్రం బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో రుణమాఫీ పత్రాల పంపిణీపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన చర్చించారు. రుణమాఫీపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కలిగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏ విధానంలో రుణమాఫీ అమలు చేస్తున్నామో రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
ఈ నెల 11 నుంచి 16 వరకు ప్రతి మండలంలో కనీసం మూడు గ్రామసభలు నిర్వహించాలని చెప్పారు. ఆ సభల్లోనే రుణ విముక్తి పత్రాలను రైతులకు అందజేయాలన్నారు. ఒకే రైతు పలు ఖాతాల ద్వారా ఒకే వ్యవసాయ భూమికి వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ విషయమై బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా సూచించారు.
జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ సదస్సుల నిర్వహణకు సంబంధించి మండల అభివృద్ధి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఓ యాక్షన్‌ప్లాన్ రూపొందించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సీపీవో వైఆర్‌బీ శర్మ, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, లీడ్‌బ్యాంక్ మేనేజర్ ఆర్‌వీ.నరసింహారావు, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ డీజీఎంలు ఎంఆర్ రఘునందనరావు, జీఎస్‌వీ కృష్ణారావు, డీడీఏ నాయక్ తదితరులు పాల్గొన్నారు.