19 ఏళ్ల కథ..!

19 ఏళ్ల కథ..! - Sakshi


శ్రీకాకుళం కల్చరల్: 1997 ఏప్రిల్ ప్రాంతం... ఎండలు ముదిరే సమయంలో కొంత మంది సాహిత్యకారులు కలిసి తెలుగు కథలకు కాసింత నీడనివ్వాలని సంకల్పించారు. తెలుగు కథ చాలా పాతది. అందుకే ఓ పరిధిని పెట్టుకుని 1910 నుంచి వెలువడిన మొత్తం తెలుగు కథానికలను, అనుబంధ సాహిత్యాన్ని సేకరించారు. దీంతో పాటుగా వర్తమాన రచయితల కంఠస్వరాలను, ఎలక్ట్రానిక్ మీడియా సాంకేతిక పరిజ్ఞానంతో పదిలపర్చడం, రచయితల రాత ప్రతులను సేకరించి పదిలపర్చడం వంటి లక్ష్యాలను పెట్టుకున్నారు.

 

మొదటగా 800 పుస్తకాలను సేకరించారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి సేకరణా పెరిగింది. 19 ఏళ్ల తర్వాత ఆ కథా నిలయంలో పుస్తకాలు 16వేలు చేరాయి. పత్రికలు 24 వేలు ఉన్నాయి. సంకలనాలు, కథా సంపుటాలు కలిపి 5వేలు ఉన్నాయి. 100 ఫీచర్ రచనలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధనాపత్రాలు, 95 జీవిత చరిత్రలు, 130 సాహిత్య సర్వసాలు, 53 ఉపయుక్త గ్రంథాల సూచికలు, 45ఇతర భాషల్లో వచ్చిన తెలుగు పుస్తకాలు, 8200 ఇతర పుస్తకాలు సేకరించారు.



15వేల కథా రచయితలకు చెందిన వివరాలు సేకరించారు. 285కు పైగా రచయితల ఫొటోలు సేకరించారు. సుమారు 40మంది రచయితల గొంతులను రికార్డు చేశారు. అందుకు ఆల్‌ఇండియా రేడియో సహకారం ఉంది.

 ఇంత శ్రమ వెనుక ఉన్న ఒకే ఒక ఆలోచన ‘కథా నిలయం’. ఆ నిలయం సాహిత్యాభిమానులకు శాశ్వత వేదిక కావాలన్న ఆలోచన. 1997 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో సుర్యానగర్ రెండంతస్తుల భవనంలో ప్రారంభమైన కథా నిలయం నేడు అందరికీ చేరువైంది.



అందుకు ఆధునిక పరిజ్ఞానం కూడా సాయం చేసింది. దీన్ని పరిరక్షించడానికి 1998 ఏప్రిల్‌లో 10మంది సభ్యులతోకూడిన ట్రస్టు ఏర్పడింది. అయితే గత ఏడాది డిసెంబరులో నూతన ట్రస్టు ఏర్పాటు చేశారు.  నూతన అధక్షులుగా డాక్టర్ బీవీఏ రామారావు నాయుడు ఉపాధ్యక్షులుగా ఎన్.రమణమూర్తి, కార్యదర్శిగా డి.రామచంద్రరావు, సంయుక్త కార్యదర్శిగా కె.వి.ఎస్. ప్రసాద్, ట్రజరర్‌గా కాళీపట్నం సుబ్బారావు, ట్రస్టు సభ్యులుగా కవనమూర్తి, వివిన మూర్తి, అట్టాడ అప్పలనాయుడులు ఉండగా, నూతనంగా కనుగుల వేంకటరావు, విశ్వనాథ నాగేశ్వరరావు, దాసరి అమరేంద్ర, డి.విజయభాస్కర్, సి. ప్రసాద్‌వర్మలు చేరారు.

 కాలానికి అనుగుణంగా కథా నిలయం తన స్వరూపాన్ని కూడా మార్చుకుంటోంది.



ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ పుస్తకాలను పాఠకులకు అందిస్తోది. ‘కథానిలయం.డాట్‌కామ్’లో దాదాపు 88 వేల కథలు ఉండడమే దీనికి నిదర్శనం. పంతొమ్మిదేళ్ల ఈ జ్ఞాపకం ఇప్పటి పాఠకులకు కూడా మధురానుభూతులు పంచుతోంది. ఇప్పటికీ కథలపై పరిశోధనలు చేస్తున్న వారికి తన వంతు సాయం చేస్తోంది.

 

13,14 తేదీల్లో వార్షికోత్సవ సభలు...

కథా నిలయం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13న మధ్యాహ్నం 2.30గంటలకు కథానిలయంలో నెల్లూరుకు చెందిన ఈదురు సుబ్బయ్య సాహితీ పీఠం వారిచే కథానిలయం వ్యవస్థాపకులు కాళీపట్నం రామారావు మాస్టారుకు సత్కారం, స్వీయ పరిచయాలు, పుస్తకావిష్కరణలు, అతిథులతో ఇష్టాగోష్టి అట్టాడ అప్పలనాయుడు నిర్వహణలో జరుగనున్నాయి. 14న వార్షికోత్సవ సభ మహిళా కళాశాలలోని ఆడిటోరియంలో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది.  

 

యవ్వన దశలో ఉంది...

కథా నిలయం యవ్వన దశలో ఉంది. దీని నిర్వహణ మెరుగుకు మూలధనం అభివృద్ధి చేయాల్సిఉంది.రూ.25లక్షలకు పెంపుకు కృషి చేస్తామన్నారు. గతంలో నిధుల సేకరణపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. అయితే దీని నిర్వహణ కోసమైనా సేకరణ చేయాల్సి ఉంది. ఎవరైనా విరాళాలు ఇవ్వవచ్చు.

 - బీవీఏ రామారావు నాయుడు, ట్రస్టు అధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top