జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..

12 People Released From The Rajamundry Central Jail - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : తప్పు చేశారు. ఆ తప్పులకు శిక్ష కూడా అనుభవించారు. పశ్చాత్తాపంతో జైలు జీవితాన్నీ గడిపిన ఆ ఖైదీలు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తిపొందారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 12 మంది ఖైదీలు విడుదలయ్యారు. అర్హులైన ఖైదీలకు గత టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో కొందరు ఖైదీలు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ స్వీకరించిన హైకోర్టు అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీఓ నంబర్‌ 6 విడుదల చేస్తూ రాష్ట్రంలో అర్హులైన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు జీవో విడదల చేసింది. దాని ప్రకారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి 57 మంది సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలున్నారని, వీరు క్షమాభిక్షకు అర్హులని జైలు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

అయితే టీడీపీ ప్రభుత్వం జీవో 46 ప్రకారం కేవలం ఎనిమిది మంది ఖైదీలను మాత్రమే విడుదల చేసింది. ప్రభుత్వ పక్షపాత వైఖరికి అర్హులైన ఖైదీలు హైకోర్టును ఆశ్రయించారు. ఖైదీల పిటిషన్‌ విచారణ చేసిన కోర్టు అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి కోర్టుకు వెళ్లిన ఖైదీలు జూలై ఒకటో తేదీన ఒకరు విడుదల కాగా, ఆగస్టు నెలలో 11 మంది, సెప్టెంబర్‌ ఒకటో తేదీన ఎనిమిది మంది, సెప్టెంబర్‌ 12న 12 మందిని విడుదలయ్యారు. మరో 17 మంది అర్హులైన ఖైదీలు ఈ వారంలో విడుదలవుతారని సెంట్రల్‌ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ కె.వెంకట రాజు పేర్కొన్నారు. 

విడుదలైన ఖైదీలు వీరే..
చేదల రామిరెడ్డి, కాపర్తి సత్యనారాయణ, నక్కా సత్యనారాయణ, మోర్త నాగేశ్వరావు, గుమ్మడి ఏసు, ఉచ్చుల రాఘవులు, గంటేటి ప్రసాద్, శెట్టి చిన్నయ్య, గంటి నూకరాజు, డేరింగుల సుమంత్, పొలినాటి ప్రేమ్‌ కుమార్, చెక్కా జోసఫ్‌.

టీడీపీ ప్రభుత్వ తీరుతో నా కుమారుడిని కోల్పోయాను 
నేను 2010లో హత్య కేసులో శిక్షపడి జైలుకు వచ్చాను. వ్యవసాయం చేసుకుని జీవించేవాడిని,  నాకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడికి వివాహమైంది. విడుదల కావడం సంతోషంగా ఉంది. కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఎదైనా పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటాను. నేను విడుదలవుతానని ఆశతో ఎదురు చూసిన నా చిన్న కుమారుడు  గణేష్‌ విడుదల కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. 
– చెక్కా జోసఫ్‌ గుంటూరు

కుటుంబాన్ని చక్కదిద్దాలి
నా కుటుంబ ఆస్తితగాదాలో కుమారుడిని కోల్పోయాను. దానికి నేనే కారణమయ్యాను. 2010లో జీవిత ఖైదీ పడింది. కూలి పనులు చేసుకుని జీవించేవాడిని, జీవనోపాధి వెతుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలి. 
– నక్కా సత్యనారాయణ, రాజోలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top