నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది.
విశాఖపట్నం: నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాలు కోసం 180042500002 నెంబర్కు ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు.
ప్రమాదం వివరాలు తెలిపేందుకు హెచ్‌పీసీఎల్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, దానిని మృతుల బంధువులు అడ్డుకున్నారు. ఆచూకీ తెలియని మృతదేహాల కోసం అధికారులను వారు నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్నారు. ప్రమాద ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలిస్తారు.