ఇండియా, ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు నేడొక కీలక మలుపులో నిలిచాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన అవి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాయి. అంతర్జాతీయ వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతున్న తరుణంలో క్రమబద్ధ ఆదాన ప్రదానాలు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి.
మేడిన్ ఇటలీ... మేడిన్ ఇండియా
ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆ యా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన మార్పిడి నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం తదిత రాలే ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలకు రూపు నిస్తాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. డిజైన్, తయారీ నైపుణ్యం, అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్లతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో భారత్ శరవేగంగా ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది. రెండు దేశాలకుగల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) బాటలు వేస్తుంది.
రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్‌టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–ఇండియా మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరి పెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ‘మేడ్ ఇన్ ఇటలీ’ అనేది అంతర్జాతీయంగా అత్యుత్తమ నాణ్యతకు పర్యాయ పదబంధం. ఇప్పుడిది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ నిర్దేశిత ఉన్నత నాణ్యత లక్ష్యంతో సమన్వయం ఏర్పరచు కుంటుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం ఉత్పాదన దిశగా ఇటలీ వ్యాపార సంస్థలలో ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం.
ఏఐలో మానవీయతకే ప్రాధాన్యం
ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో అసాధారణ పరిధిగల సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చైతన్యవంతమైన భారత ఆవిష్కరణావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యంగల వృత్తి నిపుణుల వనరులు, ఇటలీకిగల అత్యధునాతన పారిశ్రామిక సామర్థ్యం మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నిటా మన సహ కారం సహజసిద్ధమైనదిగా, వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పరిణామశీలతకు తోడ్పడుతుంది. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రకంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. మానవతావాద సంప్రదాయంలో పాదుకున్న మానవ–కేంద్రక ‘అల్గార్–ఎథిక్స్’ను ప్రోత్సహించడంలో ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ జి7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ సంయుక్త దృక్పథమే.
అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్ప టికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజి నీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో సంయుక్త కార్యక్రమాలు చేపట్టడం సహా భవిష్యత్తరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, ఇండియా సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరో సాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు, మాదక ద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనగల సామర్థ్యాన్ని పటిష్ఠం చేయడంలో ఈ సహకారం దోహదం చేస్తుంది.
ఇండో–మధ్యదరా కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం
మన భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకే తికతల దాకా... స్మార్ట్ గ్రిడ్‌ల నుంచి పునరుత్థాన మౌలిక సదు పాయాల వరకూ భారత్, ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మన సహకారం కూడా కీలకం.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలక కేంద్రాలైన ఇండో–పసి ఫిక్, మధ్యధరా ప్రాంతాల నడిబొడ్డున ఇండియా, ఇటలీ ఉన్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలను వేర్వేరు పరిధులుగా కాకుండా అంతకంతకూ పరస్పర సంధానితం అవుతున్న ప్రదేశాలుగా పరిగణించాలి. హిందూ మహాసముద్రాన్ని ఐరోపాతో ముడిపెట్టే వాణిజ్య, సాంకేతిక, ఇంధన, డేటా సహా సమాలోచనలకు కీలక మార్గమైన భారత–మధ్యధరా ప్రాంతం ఆవిర్భావానికి మన రెండు దేశాలే ప్రత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ పరస్పర సంధాన క్రమంలోనే మన స్నేహబంధం సహజ రీతిలో ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిఢవిల్లుతూ – రెండు ఖండాలను కలిపి, కొత్త ప్రపంచ గమనాన్ని రూపుదిద్దుతుంది. ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు ‘ఇండియా– మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్’ (ఐఎంఈసీ) ఒక ప్రతీక.
భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ మానవతావాద సంప్రదాయం కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. అందుకే, రెండు దేశాల ప్రజలకు కేంద్ర స్థానమిస్తూ ఇండియా–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాది వేయాలని మా సంయుక్త దార్శనికత లక్ష్యనిర్దేశం చేసుకుంది. 


