పూటకో మాట మాట్లాడితే ఎలా పవన్‌? | Pawan Kalyan impatient with CM Vijay | Sakshi
Sakshi News home page

పూటకో మాట మాట్లాడితే ఎలా పవన్‌?

May 19 2026 12:47 PM | Updated on May 19 2026 2:19 PM

Pawan Kalyan impatient with CM Vijay

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే జాలేస్తుంది. జనసైనికుల ప్రతినిధిగా సీఎం అవుతాడనుకున్న పవన్‌... కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులను అవమానించేలా మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హీరోలపై కొందరిలో వెర్రి అభిమానం ఉంటుందని అంటారు. హేతుబద్దత, మంచి, చెడు  విశ్లేషణ కొరవడతాయని అంటారు. మంగళగిరిలో జనసేన  సమావేశంలో జరిగిన ఈ సన్నివేశం చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది.  

తమిళనాడులో పార్టీని స్థాపించి రెండేళ్లలోనే  ముఖ్యమంత్రైన విజయ్‌తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్‌కు అసహనంగా ఉండవచ్చు. దానిపై నేరుగా వివరణ ఇచ్చి ఉండవచ్చు. అలా కాకుండా ‘‘ఊళ్లో పెళ్లికి..’’ అన్న సామెత కాస్త మార్చి ఊళ్లో పెళ్లవుతుంటే పిల్లలు అటూ, ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తుంటారని సర్దుకున్నారు. అయినా ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విస్తారంగా కథనాలు వచ్చేశాయి. అభిమానులను కుక్కలతో ఎలా పోల్చుతారంటూ ప్రశ్నలు సంధించారు.  నిజానికి ఈ సామెతను ప్రస్తావించినప్పుడు జన సైనికులంతా అవమాన భారంతో కుంగిపోయి ఉండాలి. కాని పలువురు చప్పట్లు కొట్టారు. అంటే వారికి ఆయన ఉద్దేశం అర్థం కాలేదన్నమాట. ఇంత అమాయకులు కనుకే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా వారిని మభ్యపెట్టగలుగుతున్నారా?

2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్‌ 2014లో సొంత పార్టీ పెట్టినప్పటి తరువాత కూడా... ఆయన ఎన్ని మాటలు మార్చాడో అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పడం, మాటమార్చడంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు రికార్డులు కూడా ఈయన బద్ధలు కొట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు, కాపు సామాజిక వర్గం గట్టిగా కోరుకుంది. గత ఎన్నికల సమయంలో పవన్‌ రెండేళ్లపాటు సీఎం పదవి, కనీసం యాభై సీట్ల డిమాండ్‌ను చంద్రబాబు ముందు పెట్టి ఉండాల్సిందని చాలామంది అప్పట్లో సూచించారు కూడా. ​కానీ ఆయన వీటిని పట్టించుకోలేదు. ఈవీఎంల మాయో, లేక జనం ఓట్లు వేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. తనకు మద్దతిస్తే కాపుల నుంచి సీఎం అయి చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ టీడీపీకి పదిహేనేళ్లపాటు మోస్తానని చెబుతుండడం ఆ వర్గాలను నిరాశ పరుస్తోంది. టీడీపీని మోయడానికి జనసేన పేరుతో పార్టీ పెట్టడం దేనికి అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడులో విజయ్ సొంత సిద్ధాంతం, వైఖరితో ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి  విజయం సాధించారు. కానీ పవన్‌లో ఈ చిత్తశుద్ది ఎన్నడూ వ్యక్తం కాలేదు. 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అది ఎలాంటి వ్యూహం అవుతుంది? తొలుత చెగువేరా వెంట ఆ తరువాత తర్వాత మోడీ అంటే...  కమ్యూనిజం నుంచి సనాతనానికి మారిన చరిత్ర పవన్‌ది. అవసరమైతే  సీఎం పదవినైనా అయినా వదలుకుంటాను తప్ప కుల, మత రాజకీయాలు చేయను అని స్పష్టంగా చెప్పిన చరిత్ర విజయ్‌ది. పవన్ కళ్యాణ్ నిత్యం తెలుగుదేశం తరపున అనేక అసత్యాలను ప్రచారం చేయడానికి కృషి చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటారు.  

తనకు  కుల భావన లేదని ఒకసారి, కాపులైనా తనకు ఓటు వేయరా అని మరోసారి, అమరావతి  కుల రాజధాని అవుతోందని ఇంకోసారి, తాను ఎప్పుడూ అమరావతికి మద్దతు ఇచ్చామని వేరొకసారి ఇలా అనేక అంశాలలో మాటలు మార్చి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు  మిస్సింగ్ అంటూ చెప్పిన  పచ్చి అబద్దం గురించి ఈనాటికి వివరణ ఇవ్వలేకపోయారు. ఇలా అనేక సార్లు  మాట మార్చడానికి వెనుకాడలేదు. వేరే  పార్టీవారి కోసం విజయ్ పనిచేయాల్సిన పని లేదు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2019లో ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెప్పడం అసత్యమా?కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయింది నిజమే కావచ్చు.

కాని దానిపై ఆత్మపరిశీలన చేసుకున్నారా? అప్పట్లో లక్నో వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఎన్నికల పొత్తు  కోరిన సంగతి ఆయన మర్చిపోయారేమో! ఆ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టిన విషయం ఆయనకు జ్ఞప్తికి లేదనుకోవాలా? ఓటమి తర్వాత వెంటనే బీజేపీతో పొత్తు కోసం  డిల్లీ వెళ్లారా? లేదా? ఇదంతా డబుల్ గేమ్ కాదా? పొత్తు  పెట్టుకోవడం తప్పుకాదు.కాని తనకేదో సిద్దాంతం ఉన్నట్లు నమ్మబలకడమే బాగోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ఉపయుక్తమని ఈయన ఇచ్చిన సలహాను విజయ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఏకంగా సీఎం అవడం  పవన్‌కు బాగా చికాకుగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా రాజకీయం చేసి ఉంటే  ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉండేదని ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాలు భావిస్తున్నాయి.

అదే  విషయం ఆయనకు చెవిలో చెబితే కోపం వచ్చినట్లు ఉంది.తాను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం తనను తాను మోసం చేసుకోవడం కాదా? పలుమార్లు  తాను సీఎం అయి చూపిస్తానని అన్నారా? లేదా? సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని పవన్ ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎవరైనా నమ్ముతారా? పోనీ ఏమిటి అయన తీసుకువచ్చిన మార్పు. సమాజం సంగతి అటు ఉంచి, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ ల గురించి ఎన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమని పొగుడుతున్నారు? దానిపై వివరణ ఇచ్చారా? మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్నడైనా నోరు తెరిచారా?ఎవరిదాకానో ఎందుకు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక యువతి చేసిన ఆరోపణల గురించి స్పందించారా? శ్రీకాళహస్తిలో సొంత పార్టీ మహిళా నేత టీడీపీ ఎమ్మెల్యేపై చెప్పిన సంగతులేమిటి? దానిపై ఎక్కడైనా మాట్లాడారా? 

వైసీపీపై రాజకీయ విమర్శలు చేయవచ్చు. కాని అలాకాకుండా టీడీపీ నేతల మాదిరి అసత్యమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సమర్థనీయం కాదు. చిత్రం ఏమిటంటే వంగవీటి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆయన మద్దతుదారులను పవన్ ప్రశ్నించడం చూసి విస్తుపోయారు.  రంగాను హత్య చేసిన వారితో, ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వారితో, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో అంటకాగుతూ రంగా హత్యపై కాపులనే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను  పలువురు ఎద్దేవా చేశారు.  పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడుతున్నారని చాలామంది అంటుంటారు.

కాని అది నిజం కాకపోవచ్చని, టీడీపీ కుతంత్రాల రాజకీయం బాగా వంట పట్టించుకుని అదే దారిలో సాగితేనే ప్రజలను మభ్య పెట్టవచ్చన్న ఉద్దేశంతో పవన్ ఉన్నారేమో అన్న అనుమానాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు. ఏదో రకంగా తంటాలు పడి రాజకీయాలలో పదవులు పొందవచ్చేమో కాని, ప్రజలలో విశ్వసనీయత, గౌరవ స్థానం పొందడానికి చిత్తశుద్ది,లక్ష్య  శుద్ది ఉండాలి. అవమానించినా చప్పట్లు  కొట్టే అభిమానులు  ఉండడం చూస్తే  పవన్ కళ్యాణ్ అంతవరకు అదృష్టవంతుడే అని చెప్పాలేమో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement
 
Advertisement
Advertisement