Mecca Masjid blast
-
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్‌పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్‌పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్‌పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్‌పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్‌చంద్ర, సందీప్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్‌చంద్ర, సందీప్‌లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్‌లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
2007 మక్కా మసీదు పేలుళ్లు.. మాసిపోని మరక
సాక్షి, హైదరాబాద్: వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. అది 2007, మే 18వ తేదీ మధ్యాహ్నం. సుమారు 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు వజుఖానా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు తర్వాత నిర్ధారించారు. మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. పేలుడు సంభవించిన స్థలానికి సమీపంలోనే.. పేలని మరో ఐఈడీ బాంబ్ ని గుర్తించారు పోలీసులు. అరెస్టుల పర్వం ►జూన్ 2010 లో ఈ కేసులో CBI నిందితుల ఛార్జీషీట్ లో సునీల్ జోషి పేరును చేర్చింది. అయితే డిసెంబర్ 29, 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ జోషి హత్యకు గురయ్యాడు. ► ఆపై నవంబర్ 19, 2010న హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) నిందితుడిగా గుర్తించారు. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ► డిసెంబర్ 18, 2010న మక్కా మసీదు పేలుడు కేసులో అసీమానంద అరెస్ట్ అయ్యాడు. ► 2011 డిసెంబర్ 3 న మక్కా మసీదు పేలుడు కేసులో మరో అరెస్ట్ జరిగింది. జరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్ అయ్యాడు. ► ఏప్రిల్ 2011లో ఈ కేసుని సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ కి బదిలీ చేసింది. ► 2013 మార్చి 2న మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ ని పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ► మార్చి 23, 2017న హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అసీమానందకు బెయిల్ మంజూరు అయ్యింది. ► ఏడేళ్ల తర్వాత అసీమానందకు విముక్తి. మార్చి 31, 2017న అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ► ఏప్రిల్ 16, 2018 న ఈ కేసులో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు. ► నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులపై ఉన్న కేసును కొట్టివేసీన నాంపల్లి కోర్టు. -
నిగ్గు తేలని నిజం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ళ కేసులో అయిదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం దర్యాప్తు సంస్థల నిర్వాకానికి తాజా నిద ర్శనం. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ప్రార్థన సమయంలో హైదరాబాద్ పాత బస్తీలోని మక్కామసీదులో సెల్‌ఫోన్ ద్వారా బాంబులు పేల్చడం వల్ల తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాంబు పేలుళ్ళ తర్వాత మసీదు వెలుపల కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్ళు రువ్విన కారణంగా పోలీసులు జరిపిన కాల్పులలో అయిదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంతకాలం న్యాయం కోసం వేచి చూసి తీర్పు వివరాలు తెలు సుకొని నిరాశ చెందారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు క్రమంలో సుమారు రెండు వందలమంది అనుమా నితులను ప్రశ్నించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ప్రథమంగా బిలాల్ అనే ఉగ్రవాదిని పేలుళ్ళకు సూత్రధారిగా అనుమానించారు. పాకిస్తాన్లో స్థావరం కలిగిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–జిహాద్–ఇ–ఇస్లామీ (హెచ్యూజేఐ)లో బిలాల్ సభ్యుడని దర్యాప్తు అధికారులు భావించారు. కానీ అనుమానాన్ని ధ్రువీక రించడానికి తగిన ఆధారాలు లభించలేదు. న్యాయస్థానం బిలాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అద నపు సమాచారం అందింది. 2006–07లో మక్కామసీదుతో పాటు మరో మూడు ప్రాంతాలలో సెల్‌ఫోన్ ద్వారా జరిపిన పేలుళ్ళు సంభవించాయి. మహారాష్ట్రలోని మాలేగాంలో 2006లో పేలుళ్ళు జరిగాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లోనూ, అజ్మీర్ దర్గాలోనూ 2007లో అదే ఫక్కీలో బాంబులు పేలాయి. ఈ ఘాతుకాల వెనుక ఒకే సంస్థ ఉన్నదనే అభిప్రాయానికి వచ్చిన సీబీఐ ఆ దిశగా దర్యాప్తు కొనసాగించింది. ‘అభినవ్ భారత్’ అనే హిందూ తీవ్రవాద సంస్థ ఈ నేరం చేసినట్టు గుర్తించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దేవేందర్‌సింగ్, వ్యాపారి లోకేశ్ శర్మ, ఆయన గురువు సునీల్ జోషీలు మక్కామసీదు కాల్పుల వెనుక ఉన్నారని నిర్ధారించింది. ‘అభినవ్ భారత్’ మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూత్వవాదులు ఇండోర్ కేంద్రంగా నడుపుతున్న సంస్థ అని సీబీఐ అభిప్రాయం. దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం లేకుండానే అనూహ్యమైన పరిస్థితులలో సునీల్ జోషీని మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సీబీఐ మొత్తం 68 మంది సాక్షులను విచారించగా వారిలో 54 మంది ఎదురు తిరిగారు. ఈ దశలో నాలుగు పేలుళ్ళ కేసుల దర్యాప్తు బాధ్య తను సీబీఐ నుంచి ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ–జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించారు. ఈ సంస్థ చేసిన దర్యాప్తులో అసీమానంద అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, గుజరాత్ ఆశ్రమ నివాసి ప్రధాన నిందితుడని తేలింది. ఆయనతో పాటు మరి పదిమందిపై అభియోగాలు చేశారు. 2017 మార్చిలో దేవేందర్ గుప్తాను అజ్మీర్ దర్గా పేలుళ్ళ కేసులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అసీమానందను నిర్దోషిగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. కానీ మక్కామసీదు కేసులో మాత్రం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అయిదుగురిని మాత్రమే విచారించి మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. వారిపైన ఎన్ఐఏ చేసిన అభియోగా లను నిరూపించేందుకు తగిన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోయిం దని భావించిన 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె. దేవేందర్‌రెడ్డి అయిదు గురినీ నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుడైన దేవేందర్ గుప్తా సిమ్ కొన్నట్టు కానీ, మరో నిందితుడు రాజేందర్ చౌదరి బాంబు పేల్చినట్టు కానీ రుజువులు లేవని జడ్జి నిర్ణయించారు. ఇంతటి కీలకమైన కేసులో తీర్పు చెప్పిన వెంటనే రాజీనామా లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్‌కు పంపించి జడ్జి రవీందర్‌రెడ్డి సంచలనం కలిగించారు. రాజీనామాకు దారితీసిన కారణాలపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జడ్జిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ సారథ్యంలోనైనా దర్యాప్తు వేగం, సామర్థ్యం పెంచి దోషులను పట్టు కొని, తగిన ఆధారాలు సేకరించి, శిక్ష పడేవిధంగా ప్రాసిక్యూషన్ వాదించి ఉంటే దర్యాప్తు సంస్థ మోపిన అభియోగాలు నిజమని నిర్ధారణ జరిగేది. సీబీఐ కానీ ఎన్ఐఏ కానీ నిందితులపైన పెట్టిన కేసులలో వీగిపోయినవే అత్యధికం. ఎన్ఐఏ డైరెక్టర్‌గా శరద్ కుమార్ సేవలను పొడిగించడం ఒక వివాదాస్పదమైన అంశం. అసీమానం దకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో అప్పీలు చేయాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎన్ఐఏ అధికారులు కేంద్ర కార్యాలయానికి సిఫార్సు చేసినప్పటికే ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ కేసులో అసీమానందకు బెయిల్ మంజూరైనప్పుడు కూడా ఎన్ఐఏ పైకోర్టులో అప్పీలు చేయలేదు. ఈ కేసులో ఇంద్రేశ్ కుమార్, ప్రజ్ఞాఠాకూర్ వంటి చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులకు మిన హాయింపు మంజూరు చేశారు. అసీమానంద స్వయంగా మక్కామసీదు పేలుళ్ళను ఎట్లా జరిపారో వివరంగా న్యాయస్థానంలోనూ, మీడియా ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అసీమానందను నిర్దోషిగా కోర్టు నిర్ణయించడం విశేషం. 2010 డిసెంబర్ 8న అసీమానంద కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట నేరం అంగీకరించారు. ‘నాకు మరణదండన విధించే అవకాశం ఉన్నదని నాకు తెలుసు. అయినా సరే నేరం అంగీకరిస్తూ ప్రకటన చేయదలిచాను’ అంటూ మాట్లాడారు. పోలీసు కస్టడీలో తీసుకున్న నేరాంగీకార వాంగ్మూలం చెల్లనేరదని జడ్జి రవీందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ కేసులో తీర్పుపైన బీజేపీ ఆనందం వెలిబుచ్చింది. కర్ణాటక ఎన్నికల ముందు ఇటువంటి తీర్పు రావడం రాజకీయంగా బీజేపీకి సాను కూలమైన పరిణామం. దేశంలో దర్యాప్తు సంస్థలు ఏ స్థాయిలో ఉన్నా ఏ పేరుమీద ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు లేవనే వాస్తవాన్ని చాలాకాలం క్రితమే ప్రజలు అర్థం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థ సైతం అంత నిజాయితీగా, నిర్భయంగా విధ్యుక్తధర్మం నెరవేర్చడం లేదనడానికి హైదరాబాద్‌లో ఒకే ఒక నెలలో అవినీతి ఆరో పణలపైన ముగ్గురు జడ్జీలు అరెస్టు కావడం నిదర్శనం. పదకొండు సంవత్సరాల పాటు దర్యాప్తూ, విచారణా జరిగినప్పటికీ మక్కామసీదులో ఆనాడు పేలుళ్ళు జరిపిన వ్యక్తులు ఎవ్వరనే శేషప్రశ్న జాతిని వెక్కిరిస్తూనే, వేధిస్తూనే ఉంటుంది. -
‘మక్కా’ నిందితులకి బెయిల్
హైదాబాద్ : పాతబస్తీలోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులుగా ఉన్న నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద, భరత్ భాయ్లకు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న అసిమానందను 2010లో పోలీసులు అరెస్టు చేశారు. అశిమానందకు ఇప్పటికే ‘అజ్మీర్’ ,‘సంఝౌతా ఎక్స్ ప్రెస్‌లో పేలుడు’ కేసుల్లో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ చెందిన అసిమానంద బోటనీలో పోస్టుగ్యాడ్యూషన్ పూర్తి చేశారు. కమ్యూనిస్ట్ భావాలను వ్యతిరేకించి తన మకాంను గుజరాత్‌కు మార్చాడు. బెంగాల్‌ను వదిలే ముందు కొంత కాలం పాటు రామకృష్ణ మిషన్‌లో పని చేశాడు. గుజరాత్‌లోని దాంగ్స్ జిల్లాలో ఆశ్రమాన్ని నెలకొల్పిన సర్కార్ తన పేరును స్వామి అసిమానందగా మార్చుకున్నాడు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారి ఓ వర్గానికి చెందిన వారితో సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. -
‘మక్కా’ నిందితులు మరణించారా?
- వాంటెడ్‌గా ఉన్న రామ్‌చంద్ర, సందీప్ ధాంగే - 2008లో ‘చనిపోయారన్న’ ఏటీఎస్ మాజీ అధికారి సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని మక్కా మసీదు లో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు కేసులో వాంటెడ్ నిందితులుగా ఉన్న రామ్‌చంద్ర కస్సంగ్రా, సందీప్ ధాంగే ‘మరణించారా’..? మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) మాజీ ఇన్స్పెక్టర్ మహబూబ్ ముజావర్ ఇటీవల అక్కడి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ ఈ అను మానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ముజావర్ గత వారం ఓ జాతీయ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆ ఇద్దరూ 2008లోనే ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని ప్రకటించారు. తనకు ‘ఆ విషయం’ తెలిసినందుకే తనపై అక్రమం గా కేసులు బనాయించి అప్రతిష్టపాలు చేశారని పేర్కొన్నారు. మక్కా మసీదు పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు విడువగా.. ఆ తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. 58 మంది క్షతగా త్రులయ్యారు. హుస్సేనిఆలం పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్‌కు.. అక్కడ నుంచి సీబీఐ వెళ్లాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ముంబై దాడుల రోజే: ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ముజావర్ ప్రకటనతో ‘మక్కా’తో పాటు మాలే గావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు, అజ్మీర్ దర్గా బ్లాస్ట్ కేసులు కొత్త మలుపు తిరిగాయి. ఈ కేసులన్నింటిలోనూ రామ్‌చంద్ర, సందీప్ నిందితు లుగా ఉన్నారు. వీరిద్దరినీ మాలేగావ్ కేసు దర్యాప్తు నేపథ్యంలో మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు 2008లోనే పట్టుకున్నారని ముజావర్ పేర్కొన్నారు. ఆ టీమ్‌లో తానూ సభ్యుడిగా ఉన్నానని, 26/11 ముంబై దాడులు జరిగిన 2008 నవంబర్ 26న వీరిద్దరూ ఏటీఎస్ కస్టడీలో చనిపోయారని సంచల నాత్మక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, అంశాలను న్యాయస్థానం ముందు ఉంచుతానం టూ షోలాపూర్ మేజిస్ట్రేట్ కోర్టులో గత నెల మొదటి వారంలో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు, నిఘా వర్గాల కన్ను ముజావర్తో పాటు ఏటీఎస్‌పై పడింది. ఆదాయానికి మించి ఆస్తులు, ఆయుధ చట్టం కింద నమోదైన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముజావర్ అఫిడవిట్ ఎంత వరకు వాస్తవమనేది ఆరా తీస్తున్నాయి. ‘మాలేగావ్’తో వీడిన చిక్కుముడి.. మక్కా మసీదులో పేలుడు జరిగిన 3 నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో బాంబు పేలింది. ఈ రెంటికీ సారూప్యతలు ఉండటంతో ఒకే మా డ్యుల్ పనిగా అనుమానించారు. మహా రాష్ట్రలోని మాలేగావ్ పేలుడు(రెండోసారి) కేసు లో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్‌కు చెం దిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్‌ను 2008 అక్టోబర్ 28న అరెస్టు చేశారు. వీరి విచార ణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్‌చంద్ర, సందీప్ పేర్లు వెలుగులోకి వచ్చా యి. 2010 ఏప్రిల్ 28న రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మను పట్టు కున్నారు. విచారణలో ‘మక్కా’ పనీ తమదేనని అంగీకరించడంతో మూడేళ్ల తర్వాత చిక్కుముడి వీడింది. ‘మక్కా’ కేసులో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. మూడేళ్ల తర్వాత సీబీఐ.. దేవేంద్ర, లోకేష్‌లను పీటీ వారెంట్‌పై తీసుకురావడంతోపాటు స్వామి అశిమా నందను అరెస్టు చేశారు. మరో నిందితుడు సునీ ల్జోషి 2007లోనే హత్యకు గురయ్యాడని తేలిం ది. రామ్‌చంద్ర, సందీప్ థాంగే ఇప్పటికీ పరారీ లోనే ఉన్నారని అధికారులు అంటున్నారు. -
మక్కా పేలుళ్లు జరిగి నేటికి ఏడేళ్లు
చార్మినార్: పాతబస్తీ మక్కా మసీదులో పేలుడు జరిగి ఆదివారానికి ఏడేళ్లవుతున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మక్కా మసీదులో సంభవించిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా పలుచోట్ల ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. ఇక మక్కా మసీదు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మక్కా మసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రే ష్ట త్రిపాఠీ తెలిపారు. 6 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 7 ప్లాటూన్ల ఏపీఎస్పీ బలగాలతో పాటు దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది శాంతి భద్రతలను పర్యవేక్షిస్తారన్నారు. అశ్విక దళాలు గస్తీ తిరుగుతున్నాయన్నారు. పాతబస్తీలో నిరసన సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. వెంటాడుతున్న విషాదం... చార్మినార్ : మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగి ఏడేళ్లైనా.. ఆ నాటి విషాద ఘటన పాతబస్తీ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2007 మే 18న వుధ్యాహ్నం 1.18 గంటలకు బాంబు పేలింది. ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి మృతుల కుంటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ వారిని ఎన్ని లక్షలు వెచ్చించినా తీసుకు రాలేవు కదా.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి రాష్ర్ట ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష, ఇతరు నుంచి కూడా ఆర్థిక సహాయం అందిందనప్పటికీ... తమ వారు లేని లోటు తీర్చలేనిదంటున్నారు. బాంబు పేలుడు ఘటన ...తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు తమకు తీరని నష్టం జరిగిదంటున్నారు. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన ఇర్ఫాన్షరీఫ్ మృతి చెందడంతో ప్రభుత్వం నుంచి అందిన ఆర్థిక సహాయం అందింది. ఆ డబ్బుతో అతని ఇద్దరు తోబుట్టువుల వివాహాలు చేశారు. అలాగే మిశ్రీగంజ్‌కు చెందిన అక్రం అలీ ఖాన్ కుమారుడు సాజిద్ అలీఖాన్ మక్కామసీదు బాంబు పేలుడు ఘటనలో మృతి చెందడంతో...అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 6 లక్షల ఆర్థిక సహాయం లభించింది. దీంతో ఆమె వచ్చిన డబ్బుతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. అటు కుమారుడు లేక...ఇటు కోడలు లేక వయోవృద్ధుడైన అక్రం అలీ నిర్జీవంగా ఇంట్లో కాలం గడుపుతున్నాడు. ప్రస్తుతం తమకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ.... తమ వారు లేని లోటును ఎవరు తీరుస్తారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు.


