2007 మక్కా మసీదు పేలుళ్లకు పదిహేనేండ్లు పూర్తి.. మాసిపోని మరక

Mecca Masjid Blast Completes 15 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. 

అది 2007, మే 18వ తేదీ మధ్యాహ్నం. సుమారు 1.15 గం.ల సమయంలో మక్కా మసీదు వజుఖానా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది.  ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు తర్వాత నిర్ధారించారు. మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. పేలుడు సంభవించిన స్థలానికి సమీపంలోనే.. పేలని మరో ఐఈడీ బాంబ్ ని గుర్తించారు పోలీసులు.

అరెస్టుల పర్వం 
►జూన్ 2010 లో ఈ కేసులో CBI నిందితుల ఛార్జీషీట్ లో సునీల్ జోషి పేరును చేర్చింది. అయితే డిసెంబర్ 29, 2007లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్‌ జోషి హత్యకు గురయ్యాడు.

► ఆపై నవంబర్ 19, 2010న  హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) నిందితుడిగా గుర్తించారు. దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. 

► డిసెంబర్ 18, 2010న మక్కా మసీదు పేలుడు కేసులో అసీమానంద అరెస్ట్ అయ్యాడు. 

► 2011 డిసెంబర్ 3 న మక్కా మసీదు పేలుడు కేసులో మరో అరెస్ట్ జరిగింది. జరాత్‌ వల్సాద్‌కు చెందిన భారత్‌ మోహన్‌లాల్‌ రతేశ్వర్‌ అలియాస్‌ భారత్‌భాయి అరెస్ట్ అయ్యాడు.

► ఏప్రిల్ 2011లో ఈ కేసుని సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ ఎన్ఐఏ కి బదిలీ చేసింది.

► 2013 మార్చి 2న మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్‌ చౌదరి అలియాస్‌ సముందర్‌ ని పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు.  

► మార్చి 23, 2017న  హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అసీమానందకు బెయిల్ మంజూరు అయ్యింది. 

► ఏడేళ్ల తర్వాత అసీమానందకు విముక్తి. మార్చి 31, 2017న అసీమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. 

► ఏప్రిల్ 16, 2018 న ఈ కేసులో ఐదుగురు నిందితులను  నిర్దోషులుగా తేల్చిన నాంపల్లి కోర్టు. 

► నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ఐదుగురు నిందితులపై ఉన్న కేసును కొట్టివేసీన నాంపల్లి కోర్టు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top