Joseph Vijay Chandrasekhar
-
దళపతి విజయ్ హెయిర్‌స్టైల్ వెనుక సీక్రెట్ ఇదే..! అదే ఆయన్ను..
ఓ వ్యక్తి ఆహార్యంలో హుందాతనం, స్టైలిష్ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసే వాటిలో కురులది ప్రధాన పాత్ర. ఆ హెయిర్‌స్టైలే పెద్ద మనిషిలా హుందాగా చూపించడం, అలాగే పాతికేళ్ల కుర్రాడి లుక్ చూపించడంలోనూ కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ చాలా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అయిన హెయిర్‌స్టైల్స్ యువతను ఎంతలా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగానే తన ఆహార్యం మొత్తం మార్చుకుని ఓ పెద్ద తరహా లుక్‌తో కనిపించే హెయిర్‌స్టైల్‌తో ముందుకొచ్చి ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇంతలా హీరో దళపతిని అందంగా హెయిర్‌ని స్టైల్ చేసి చూపించే వ్యక్తి ఎవరంటే..తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టిపెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి చర్రిత సృష్టించారు దళపతి విజయ. హీరోగా మొదలై..ఓ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కూడా. నటనలోనూ నాయకుడిగా తనదైన మార్కుని చూపిస్తూ..ప్రజలకు మంచి పాలన అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఒక నాయకుడిగా పెద్దతరహాలో కనిపించే ఆయన ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించేది హెయిర్. అంత అందంగా ఆయన హెయిర్‌ని తీర్చిదిద్దే వ్యక్తి జగదీష్ అవస్థి. 30 ఏళ్ల ఈ హెయిర్ స్టైలిస్ట్ దళపతి అభిమానులను అలరించేలా రకరకాల హెయిర్‌ని తీర్చిదిద్దడంలో దిట్ట. బిగిల్' సినిమా నుంచి 'లియో', 'గోట్ (GOAT)' వరకు విజయ్‌కి హెయిర్ స్టైలింగ్‌గా వ్యవహరిస్తున్నాడు. జగదీస్ విజయ్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ను సీఎంగా చూడటం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తనకు పదోతరగతి నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది. ఆ నేపథ్యంలోనే సెలూన్‌కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి, ఒక సెలూన్లో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన హెయిర్‌స్టైలిస్ట్‌ల ద్వారా విజయ్ బిగిల్ మూవీ కొత్త హెయిర్‌స్టైల్ కోరుకుంటున్నారని తెలిసింది. అలా ఆయన్ను తనకు కలిసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతీ మూవీకి తనే హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జననాయగన్‌కు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపాడు. విజయ్ హెయిర్‌స్టైల్‌లో బాగా పాపులర్ అయ్యింది 'బీస్ట్' స్టార్ హెయిర్‌స్టైల్. అయితే హీరో విజయ్‌ది సహజంగా ఒత్తుగా హెల్దీగా ఉండే జుట్టు కావడంతో ఈ హెయిర్‌స్టైల్ బాగా నప్పిందని చెప్పుకొచ్చాడు. అదీగాక సులభంగా రకరకాల హెయిర్స్టైల్లోకి మార్చగలమని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రతి మూవీలోని ఆయన పాత్రకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆయన జుట్టుకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు బాగా చేశావ్ అబ్బాయ్ అని ప్రశంసించన క్షణం ఇప్పటికీ మరువలేను అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇక 2023లో లియో జుట్టుతో చేసిన వైరల్ లుక్ గురించి మాట్లాడుతూ..ఆ లుక్ల సాల్ట్-అండ్-పెప్పర్ (ఉప్పు-మిరియాల) జుట్టు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ స్టైల్లో నుదుటిపై జుట్టు పడే స్టైల్ మాత్రం ఆయన ఆలోచననే అని క్రెడిట్ మొత్తం హీరో విజయ్‌కే ఇచ్చాడు. అంతేగాదు ఆయ హెయిర్‌ని సరిచేస్తున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉంటారని అన్నాడు. అలాగే సెట్లో ప్రతిఒక్కర్ని శ్రద్ధగా చూసుకుంటారని, అందరితోటి చాలా సౌమ్యంగా మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. చివరగా యవతరం హెయిర్‌స్టైలిస్ట్‌లకు చక్కటి చిట్కాలే కూడా సూచించాడుకేవలం హెయిర్‌స్టైల్స్ మాత్రమే నేర్చుకోకండి , మనుషులను అర్థం చేసుకోవడం, వారి వ్యక్తిత్వం, కెమెరా కోణాలు, ఫ్యాషన్ ఉనికిని క్యాచ్ చేయడం వంటి వాటిపై పట్టు తెచ్చుకుంటేనే మన నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతీ సీజన్లో ట్రెండ్లు మారుతుంటాయి కానీ మీ ప్రత్యేకత, వృత్తి నైపుణ్యమే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టేలా పేరుని తెచ్చుపెడుతుందని అన్నాడు. (చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్) -
ఐపీఎల్‌ను తాకిన ఇళయదళపతి ఫీవర్
గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌ను పట్టుకున్న తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ ఫీవర్ ఇప్పుడు ఐపీఎల్‌కూ పాకింది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఇళయదళపతి స్టయిల్లో తన హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకొని వైరలయ్యాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 73 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన అయ్యర్, ఫిఫ్టీ పూర్తి చేసిన అనంతరం విజయ్ నటించిన Mersal సినిమాలో పాపులర్ పోజ్‌ను అనుకరించాడు. VENKATESH IYER RE-CREATED THALAPATHY VIJAY CELEBRATION 🥶 pic.twitter.com/GcOhrfqQQ2— Johns. (@CricCrazyJohns) May 17, 2026ఇది చూసి విజయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఆరాధ్య నటుడు, నాయకుడి క్రేజ్ ఐపీఎల్‌కు కూడా పాకిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్ విజయ్ స్టయిల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం సాధించడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో ఫైనల్-4కు చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ స్థానంలో వెంకటేశ్ అయ్యర్ బరిలోకి దిగాడు. రజత్ గాయపడటంతో అయ్యర్‌కు ఈ అవకాశం వచ్చింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. అయ్యర్‌తో పాటు విరాట్ కోహ్లి (58), పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది.ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. -
విజయ్‌కు ప్రముఖుల అభినందనలు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులతోపాటు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో ప్రధాని మోదీ..‘తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు సి.జోసెఫ్‌కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కలిసి ముందుకు సాగుదాం’అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్‌తో ఫోన్లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ‘టీవీకే చీఫ్ విజయ్‌కు అభినందనలు. తమిళనాడు కొత్త తరాన్ని, కొత్త గళాన్ని ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ఆదివారం విజయ్‌కు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు నడుమ బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న విషయాన్ని ఆయన ఎక్స్‌లో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విజయ్ను అభినందించారు. ‘టీవీకే అధినేత నాయకత్వంలో రాష్ట్ర రాజకీయ, సామాజికంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్,, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్లతోపాటు సినీనటులు కమల్ హాసన్, ఆర్.మాధవన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్ టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్‌కు అభినందనలు తెలిపారు. -
తమిళ సీఎంగా విజయ్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిపాలనా పర్వానికి తెరదించుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ సి.జోసెఫ్ విజయ్ ఆదివారం నూతన ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్ల తమిళనాడు చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేని ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.15 గంటలకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభమైంది. విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయించారు. టీవీకేలోని 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేశారు. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సైతం భాగస్వామిగా చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ, తమిళనాడులో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, సినీ నటి త్రిష, వామపక్ష పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలు ముందువరసలో కూర్చుని ప్రమాణస్వీకారాన్ని చూశారు. పలువురు ప్రముఖులు, తమిళ సినీతారలు, టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల ‘విజిల్’ మోతలు, ‘సీఎం విజయ్’, ‘దళపతి’ నినాదాలతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోయింది. విజయ్ తన మంత్రివర్గంలో యువత, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా ప్రమాణంచేశాక విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పాలనకు సంబంధించిన నూతన శకం ఇప్పుడే ప్రారంభమైందని స్పష్టంచేశారు. తనదైన శైలిలో ప్రమాణం చేయబోయి.. విజయ్‌తో సీఎంగా ప్రమాణం చేయించేందుకు ఆయనను పోడియం వద్దకు గవర్నర్ ఆహ్వానించారు. ‘నేను’ అని గవర్నర్ అందివ్వగా అధికారికంగా ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కాదని సొంతంగా తనదైన శైలిలో ప్రమాణంచేసేందుకు విజయ్ ప్రయ తి్నంచారు. వెంటనే గమనించిన గవర్నర్ సున్నితంగా అడ్డుకుని రాజ్యాంగంలో పేర్కొన్న శైలిలోనే ప్రమాణం చేయాలని సూచించారు. తొలి రోజే వివాదం ప్రమాణ స్వీకారోత్సవంలో గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం విశేషం. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తారు. అయితే, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం.. తమిళ్ తాయ్ వాళ్తుకు మూడో స్థానం కల్పించడాన్ని సీపీఐ, డీఎంకేలు తీవ్రంగా పరిగణించాయి. వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ప్రాధాన్యతా క్రమంలో తమిళ గీతానికి మూడోస్థానం కల్పించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీర పాండియన్, వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్తోపాటు సీపీఎం, ఐయూఎంఎల్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని, తమిళ తల్లి గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అధికారిక కార్యక్రమాల్లో తమిళ తల్లి గీతాన్ని మొదట ఆలపించడం సంప్రదాయమని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ గుర్తుచేశారు.వేదికపై 3 సంతకాలు ప్రజలకు ఇచ్చిన 3 వాగ్దానాల అమలుకు ప్రమాణ స్వీకార వేదికపైనే విజయ్ శ్రీకారం చుట్టారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కల్పించడానికి మహిళలతో ‘సింగా పెన్’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తూ మరో ఫైల్‌పై సంతకం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా దళం ఏర్పాటు కోసం మరో ఫైల్‌పై సంతకం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత, టీనేజర్లు, చిన్నారులకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయన్, యువనేత డాక్టర్ కె.టి.ప్రభు, మహిళా నాయకురాలు ఎస్.కీర్తన, ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్.నిర్మల్ కుమార్, కె.జి.అరుణ్‌రాజ్, ఎ.రాజ్ మోహన్, పి.వెంకటరమణన్లు ప్రమాణంచేసి మంత్రివర్గంలో చేరారు.నేనొక్కడినే పవర్ సెంటర్ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన విజయ్ వేదికపై తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా గుండెల్లో నివసించే అభిమానులందరికీ వందనాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు., సినిమాల్లో రాణించాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిని. ఆకలి, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకే ప్రజలను నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా. తమిళప్రజలు నన్ను సొంత బిడ్డలా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి సినిమాల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీస్సులతో ఈ పదవిలోకి వచ్చా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, మోయలేని భారాన్ని మనపై వదిలివెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేయదు. రహస్యంగా ఎవర్నీ కలవదు. ఏది చేసినా ప్రజల సాక్షిగా బహిరంగంగానే చేస్తాం. ప్రజల సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నేను తప్పు చేయను. ఎవరినీ చేయనివ్వను. నా ప్రభుత్వంలో అధికారులైనా, మంత్రులైనా ఎవరైనా ఒకే మాట మీద నడవాలి. ఇక్కడ పవర్ సెంటర్లు ఉండవు. అంతా నా నాయకత్వంలోనే నడుస్తుంది. నేనే ఏకైక పవర్ సెంటర్. గెలవగానే ఆటలు ఆడదాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరి కోసం సమప్రాధాన్యంతో పరిపాలిస్తా. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. నేను దేవదూతను కాదు. సాధారణమైన వ్యక్తిని. విద్యార్థుల కోసం విజయ్ మామ మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తులో నాకు అడ్డంకులు సృష్టించేవారు కూడా నాకు శ్రేయోభిలాషులే’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. దేవుడి పేరిట ప్రమాణం ప్రమాణ స్వీకారంలో దళపతి విజయ్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకున్నారు. సాధారణంగా నిత్యం ధరించే తెల్లచొక్కా, ఖాకీ రంగు ప్యాంటు కాకుండా ముదురు రంగు ప్యాంటు, తెల్లచొక్కా, దానిపై నలుపురంగు సూట్ ధరించారు. విజయ్ సహా మంత్రులందరూ దేవుడి పేరిట ప్రమాణం చేయడం విశేషం. రాహుల్ గాం«దీతోపాటు కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో విజయ్ సెలీ్ఫలు దిగారు. గవర్నర్‌తో గ్రూప్ ఫొటో సందర్భంగా వేదికపై అడ్డుగా ఉన్న పెద్ద బల్లను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ సైతం బల్లను పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. శాసనసభ తొలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రొటెం స్పీకర్‌గా ఆదివారం లోక్‌భవన్‌లో ప్రమాణం చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్‌తోపాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా, తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇకపై పెరంబూర్ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ పంపించారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా సచివాలయానికి రాక ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్లో విజయ్ ఆసీనులయ్యారు. కొన్ని అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం హోదాలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
విజయ్ సీఎం అయ్యాడు.. సీఎస్కే టైటిల్ గెలుస్తుంది..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసఫ్ విజయ్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ (మే 10) ఉదయం ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆథ్వర్యంలో ప్రమాణస్వీకారోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజయ్ సీఎం అవగానే సోషల్‌మీడియాలో ఓ అంశం వైరలైంది. విజయ్ సీఎం అయ్యాడు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని తమిళులు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడాని ఓ బలమైన కారణముంది.తమిళనాట ప్రభుత్వాలు మారి, కొత్త సీఎంలు వచ్చినప్పుడు సీఎస్కే టైటిల్ సాధించింది. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు సీఎస్కే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆతర్వాత 2021లో స్టాలిన్ సీఎం అయినప్పుడు కూడా సీఎస్కేనే టైటిల్ సాధించింది. ఇప్పుడు విజయ్ సీఎం అవ్వడంతో సెంటిమెంట్ రిపీటై సీఎస్కే మరోసారి టైటిల్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.వాస్తవానికి ఈ సెంటిమెంట్‌కు దగ్గరగానే సీఎస్కే ప్రస్తుత పరిస్థితి ఉంది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. సంజూ శాంసన్ ఆ జట్టు తలరాతను మార్చాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచినా, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే. -
49 ఏళ్ల రికార్డు బద్దలు
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్, దళపతి విజయ్ పూర్తి పేరు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మూడో శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎందరో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 1970ల తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు. నాడు.. నేడు నాటి ఎంజీ రామచంద్రన్‌కు, నేటి విజయ్‌కు కలిసొచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొంది డీఎంకే నుంచి బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజారిటీ అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలంపాటు కొనసాగారు. తనపై ప్రజలకున్న అభిమానాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. వ్యక్తిత్వం, రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి చూపారు. నేడు విజయ్‌కి అనుకూలించిన అంశాలు వేరేగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన ఆకాంక్ష.. వీటినే విజయ్ తనవాణిగా మార్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తమిళనాడు రాజకీయాలను తిరగరాసిన తర్వాత, ఒక నటుడు నేరుగా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎంజీఆర్ తర్వాత సినీ గ్లామర్‌తో సెయింట్ జార్జి కోటలోని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. జయలలిత ప్రస్థానం వేరు ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ, సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నాడీఎంకేను వారసత్వంగా పొంది, దానిని పటిష్టం చేసి అ«దీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం కేవలం రెండేళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందుచూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టారు. మక్కల్ ఇయక్కం (వీఎంఐ) పేరుతో సంఘాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. మొదట్లో కేవలం సేవ, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసినప్పటికీ, క్రమంగా వరదలు వంటి ప్రకృత్తి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి వాటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. 2011లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆకాంక్షను చాటారు. నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారుతాయా లేదా అనేందుకు ఇదొక తొలి పరీక్ష అయ్యింది. సినిమాల నుంచి సిద్ధాంతాల దాకా 2010– 2020 మధ్య కాలంలో విజయ్ ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కని్పస్తుంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్‌లు, అభిమానుల సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించేవారు. ఇవి యువతను, నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా పార్టీని అధికారికంగా ప్రకటించకముందే విజయ్ తన వీఎంఐ సత్తా ఏపాటిదో నిరూపించుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ’విజయ్ మక్కల్ ఇయక్కం’ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కేవలం జనాన్ని కూడగట్టడమే కాకుండా, తనకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చగల శక్తి ఈ వ్యవస్థకు ఉందని ఆ ఎన్నికలు రుజువు చేశాయి. టీవీకే ఆవిర్భావం చివరికి 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పార్టీని అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి ముందస్తు పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే–ఏడీఎంకేల ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. సుమారు 70 చిత్రాలతో తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు కూడా ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారానే ప్రచారం గత రెండేళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా, ప్రజల సమస్యలను వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమవుతూ, పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల వంటివేమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. 2025లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్‌కు రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు. తమిళనాట పెనుమార్పు 2026 ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల ఒరవడిని విజయ్ ఒక్కసారిగా మార్చేశారు. టీవీకే రాకతో తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–అన్నాడీఎంకే ద్వంద్వ పోరు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారింది. ఎంజీఆర్ హయాం తర్వాత తమిళనాడులో ఇంతటి బలమైన ముక్కోణపు పోటీ మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇంతకాలం పెద్ద పార్టీల నీడలో ఉన్న చిన్న పార్టీలు ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. -
అజిత్ కుమార్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) పరామర్శించారు. బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.తమిళనాట యువకుడు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. అజిత్‌పై పోలీసుల అమానుషంవిచారణ పూర్తి కావడంతో అజిత్‌ను పోలీసులు వదిలేశారు. మళ్లీ మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ కుమార్ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్‌లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది. సివిల్ డ్రెస్‌లో పోలీసులు..అజిత్‌పై దాడిమరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్ కుమార్ పోలిస్ స్టేషన్‌కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అజిత్ కుమార్‌ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు అజిత్ కుమార్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు, కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్‌ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్‌పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.మరోవైపు లాకప్ డెత్‌లో మరణించిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి.


