ఎంజీఆర్ తర్వాత చరిత్ర సృష్టించిన విజయ్
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్, దళపతి విజయ్ పూర్తి పేరు. తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్రను నెలకొల్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అధికారం చేతులు మారుతూ వస్తోంది. మూడో శక్తిగా ఎదిగేందుకు యత్నించిన ఎందరో సినీ దిగ్గజాలకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. 1970ల తర్వాత ఎంజీ రామచంద్రన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేకపోయారు. ఇప్పుడు విజయ్ ఆ పాత రికార్డులను చెరిపి వేసి, కొత్త ప్రత్యామ్నాయంగా ఎదిగారు.
నాడు.. నేడు
నాటి ఎంజీ రామచంద్రన్‌కు, నేటి విజయ్‌కు కలిసొచ్చిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎంజీఆర్ సినిమాలతో ప్రజాదరణ పొంది డీఎంకే నుంచి బయటకు వచ్చారు. పార్టీని ఏర్పాటు చేసిన ఆయనకు సొంత చరిష్మా, ప్రకటించిన సంక్షేమ పథకాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలా తిరుగులేని మెజారిటీ అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించారు. 1977లో సీఎం పదవిని చేపట్టిన ఆయన 1987లో మరణించే వరకు దశాబ్ద కాలంపాటు కొనసాగారు. తనపై ప్రజలకున్న అభిమానాన్ని ఒక పటిష్టమైన రాజకీయ భావోద్వేగంగా మార్చుకున్నారు. వ్యక్తిత్వం, రాజకీయం ఎలా కలిసి ఉండాలో ఆచరించి చూపారు.
నేడు విజయ్‌కి అనుకూలించిన అంశాలు వేరేగా ఉన్నాయి. యువతలో ఆందోళనలు, ప్రస్తుత పాలనపై ప్రజల్లో ఉన్న విసుగు, స్వచ్ఛమైన రాజకీయ మార్పు కావాలనే బలమైన ఆకాంక్ష.. వీటినే విజయ్ తనవాణిగా మార్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో విజయం సాధించారు. గత 49 ఏళ్లలో ఏ సినీ నటుడు సాధించని అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. 1977లో ఎంజీ రామచంద్రన్ తమిళనాడు రాజకీయాలను తిరగరాసిన తర్వాత, ఒక నటుడు నేరుగా ముఖ్యమంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎంజీఆర్ తర్వాత సినీ గ్లామర్‌తో సెయింట్ జార్జి కోటలోని తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు.
జయలలిత ప్రస్థానం వేరు
ఎంజీఆర్ తర్వాత ఎందరో నటులు భారీ అభిమాన గణంతో ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ ఆయన రికార్డును అధిగమించలేకపోయారు. జయలలిత కూడా గొప్ప సినీ నటి అయినప్పటికీ, సొంతంగా పార్టీని స్థాపించి అధికారంలోకి రాలేదు. ఆమె ఎంజీఆర్ నెలకొల్పిన అన్నాడీఎంకేను వారసత్వంగా పొంది, దానిని పటిష్టం చేసి అ«దీనంలోకి తెచ్చుకోవడం ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు.
అట్టడుగు స్థాయి నుంచి నిర్మాణం
కేవలం రెండేళ్ల క్రితం స్థాపించిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) 100 సీట్లకు పైగా గెలుచుకుంది. దీని వెనుక ముందుచూపు, పక్కా ప్రణాళిక, తీవ్రమైన కృషి ఉన్నాయి. విజయ్ తన అభిమాన సంఘాలను 2009 నుంచే ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం మొదలుపెట్టారు. మక్కల్ ఇయక్కం (వీఎంఐ) పేరుతో సంఘాలన్నిటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. మొదట్లో కేవలం సేవ, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసినప్పటికీ, క్రమంగా వరదలు వంటి ప్రకృత్తి విపత్తుల వేళ ప్రజలకు సాయం అందించడం, పేద విద్యార్థులకు ఆసరాగా నిలవడం, స్థానిక సమస్యలపై స్పందించడం వంటి వాటి ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలో జనానికి చేరువైంది. 2011లో ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమికి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా విజయ్ మొదటిసారి తన రాజకీయ ఆకాంక్షను చాటారు. నటుడికి ఉన్న ఆకర్షణ ఓట్లుగా మారుతాయా లేదా అనేందుకు ఇదొక తొలి పరీక్ష అయ్యింది.
సినిమాల నుంచి సిద్ధాంతాల దాకా
2010– 2020 మధ్య కాలంలో విజయ్ ప్రసంగాలను పరిశీలిస్తే రాజకీయ కోణం కని్పస్తుంది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆయన చేసిన విమర్శలు, సినిమాకు మించిన అంశాలపై కూడా స్పందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి. ఆడియో లాంచ్‌లు, అభిమానుల సమావేశాలు, సేవా కార్యక్రమాల ద్వారా పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, అవినీతి, పాలన వంటి అంశాలను ఆయన తరచూ ప్రస్తావించేవారు. ఇవి యువతను, నగరవాసులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి.
స్థానిక ఎన్నికల్లోనూ సత్తా
పార్టీని అధికారికంగా ప్రకటించకముందే విజయ్ తన వీఎంఐ సత్తా ఏపాటిదో నిరూపించుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ’విజయ్ మక్కల్ ఇయక్కం’ అభ్యర్థులు పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. కేవలం జనాన్ని కూడగట్టడమే కాకుండా, తనకున్న పాపులారిటీని ఓట్లుగా మార్చగల శక్తి ఈ వ్యవస్థకు ఉందని ఆ ఎన్నికలు రుజువు చేశాయి.
టీవీకే ఆవిర్భావం
చివరికి 2024 ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కళగం’(టీవీకే) పార్టీని అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎటువంటి ముందస్తు పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే–ఏడీఎంకేల ఏకచ్ఛత్రాధిపత్యానికి గండికొట్టి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. సుమారు 70 చిత్రాలతో తన మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్లు కూడా ప్రకటించారు.
సోషల్ మీడియా ద్వారానే ప్రచారం
గత రెండేళ్లుగా టీవీకే తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన పార్టీగా మార్చింది. జిల్లా కమిటీలు, నియోజకవర్గ విభాగాలు, బూత్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. విద్య, ఉపాధి, అవినీతి నిర్మూలన, జవాబుదారీతనంపై దృష్టి సారించింది. విజయ్ ఒక ఆవేశపూరిత వక్తగా కాకుండా, ప్రజల సమస్యలను వినే నాయకుడిగా తనను తాను మలుచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మమేకమవుతూ, పక్కా ప్రణాళికతో బహిరంగ సభలు నిర్వహించారు. మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూల వంటివేమీ లేకుండానే తనదైన శైలిలో ప్రచారం సాగించారు. 2025లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన బహిరంగ సభ తొక్కిసలాటకు దారితీసింది. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. విజయ్‌కు రాజకీయ నాయకుడిగా ఇది మొదటి పరీక్షగా నిలిచింది. ఆయన ఎంతో సంయమనంతో వ్యవహరించారు.
తమిళనాట పెనుమార్పు
2026 ఎన్నికల ఫలితాలతో తమిళనాడు రాజకీయాల ఒరవడిని విజయ్ ఒక్కసారిగా మార్చేశారు. టీవీకే రాకతో తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే–అన్నాడీఎంకే ద్వంద్వ పోరు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారింది. ఎంజీఆర్ హయాం తర్వాత తమిళనాడులో ఇంతటి బలమైన ముక్కోణపు పోటీ మళ్లీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇంతకాలం పెద్ద పార్టీల నీడలో ఉన్న చిన్న పార్టీలు ఇప్పుడు విజయ్ రూపంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్


