'రాష్ట్ర చరిత్రను మార్చేది ఆ నాలుగు సంతకాలే'

తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేసే మొదటి నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళంలో ఈ సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బడికి వెళ్లే ప్రతి ఇద్దరి చిన్నారులకు 500 రూపాయల చొప్పున ఇస్తానని పిల్లలను బడికి పంపించే అక్కాచెల్లెళ్లకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజే వెనువెంటనే 4 సంతకాలు చేస్తానని చెప్పారు. ఆ సంతకాలు పేదల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం అమ్మఒడి పథకం - రెండవ సంతకం వృద్ధాప్య ఫించన్లు - మూడవ సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే స్థిరీకరణ నిధి - నాలుగవ సంతకం అక్కాచెల్లెళ్లు తీసుకున్న డ్వాక్రా రుణాల మాఫీ కోసం అని వివరించారు. అధికారంలోకి వచ్చిన రెండవ రోజు ఇచ్చాపురం, టెక్కలిలలో పవర్ ప్లాంట్‌ల మూసివేయాలని అయిదవ సంతకం చేస్తానని చెప్పారు.

దివంగ మహానేత వైఎస్ఆర్ అడ్రస్ అడిగితే, ప్రతి పేదవాడు తమ గుండెలను చూపుతారని చెప్పారు. పిల్లల చదువుల కోసం ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. ఆ విషయంపై శాసనసభలో చర్చించిందిలేదు. గ్యాస్పై కూడా చర్చలేదన్నారు.

తన కొడుకుకుని ప్రధాని గద్దెపై కూర్చోబెట్టడానికి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొడుతున్నారన్నారు. బంగారంలా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టడానికి సోనియా కుట్ర పన్నారని విమర్శించారు. టిడిపికి చెందిన కొంతమంది ఎంపిలు రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచమని కోరతారు, మరికొందరు విడగొట్టమని కోరతారు. టిడిపి వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారు. సమాచార పదవులు పంచుకున్నారు అని విమర్శించారు. రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాలలో నీతిలేదు. అవసరమైతే రాష్ట్రాన్ని విడదీయటానికి కూడా సిద్ధపడుతున్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం మారిపోయిందని బాధపడ్డారు.

9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక రైతుకు మంచి చేశాను. ఒక మహిళకు మంచి చేశాను. ఒక విద్యార్థికి మంచి చేశాను అని చెప్పగలరా? అని ప్రశ్నించారు. తనను చూసి ఓటు వేయమని అడిగే దమ్ము, ధైర్యం ఉన్నవాడే నాయకుడన్నారు. పలానా వాడు తమ నాయకుడని ప్రతి కార్యకర్త కాలరెగరేసి చెప్పుకునేలా ఉండాలని చెప్పారు. నాలుగు నెలలు ఆగండి. ఆ తరువాత సువర్ణ యుగం వస్తుందని భరోసా ఇచ్చారు. 30 ఏళ్లపాటు వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top