గుడిని కాపాడేందుకు ముస్లింల మాన‌వ హారం | Sakshi
Sakshi News home page

గుడిని కాపాడేందుకు ముస్లింల మాన‌వ హారం

Published Wed, Aug 12 2020 3:26 PM

సాక్షి, బెంగ‌ళూరు: ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగ‌ళూరులో విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు పెట్టిన వ్య‌క్తి న‌వీన్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస‌మూర్తి బంధువు కావ‌డంతో స‌ద‌రు ఎమ్మెల్యే ఇంటిపై మంగ‌ళ‌వారం రాత్రి దాడి జ‌రిగింది. ఆయ‌న ఇంటిని ధ్వంసం చేయ‌డంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ప్రాంతంలోని సుమారు 200-250 కార్ల‌తో పాటు పోలీసు వాహ‌నాల‌కు నిప్పంటించారు. దుండ‌గులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జ‌ర‌ప‌గా అల్ల‌ర్లు తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు మ‌ర‌ణించ‌గా, 60 మంది పోలీసు సిబ్బంది గాయ‌ప‌డ్డారు. 

దీంతో డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. ఈ అల్ల‌ర్ల నేప‌థ్యంలో డీజే హ‌ళ్లిలోని ఓ ఆల‌యాన్ని దుండ‌గుల నుంచి కాపాడేందుకు కొంద‌రు ముస్లిం వ్య‌క్తులు ఒక‌రి చేతులు మ‌రొక‌రు ప‌ట్టుకుంటూ గుడి చుట్టూ మాన‌వ‌ హారం చేప‌ట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. హిందూముస్లింలు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిమెలిసి ఉండాల‌ని సందేశాన్నిచ్చార‌ని నెటిజ‌న్లు వారిని కొనియాడుతున్నారు. కాగా బెంగ‌ళూరు అల్ల‌ర్ల ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 110 మందిని అరెస్టు చేయ‌గా, వివాదాస్ప‌ద పోస్టు చేసి ఘర్ష‌ణ‌కు కార‌ణ‌మైన న‌వీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగ‌ళూరులో 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంది.

Advertisement