రానున్న ఎన్నికల్లో టీటీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీలతో కలసి వెళ్లేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఏఐసీసీ కోర్ కమిటీ టీపీసీసీకి అధికారికంగా అనుమతిచ్చింది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డితో ఏఐసీసీ కార్యాలయంలోని వార్‌రూమ్‌లో కోర్ కమిటీ సభ్యులు గులాంనబీ ఆజాద్, ఆంటోని, జైరాం రమేశ్‌లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో ఇప్పటివరకు జరిగిన చర్చలు, సీట్ల పంపకాలపై ఆయా పార్టీల ప్రతిపాదనలు, రాష్ట్రంలో పొత్తులు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఉత్తమ్, జానాలు పార్టీ అధిష్టానానికి వివరించారు.