నమ్మి ఓటేసి మోసపోయాం: మాజీ ఎంపీ ఎదుట వాపోయిన ఓ మహిళ
ఆదోని సెంట్రల్: ఒకసారి నమ్మి మోసపోయామని తిరిగి ఆ తప్పు చేయదలుచుకోలేదని ఓ మహిళ మాజీ ఎంపీ బుట్టా రేణుకతో ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని 40వ వార్డులో వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ప్రణీతరెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థి బాషాను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని అడిగినప్పుడు ఈ విషయాన్ని బయలుపరిచింది. మా సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి ఓటు వేస్తే మమ్మల్ని పట్టించుకునే వారు లేరన్నారు.
తాగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నామని, ఆ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను స్వయంగా నేనే తీసుకుని వచ్చి చూపించినా కూడా పరిష్కారం కాలేదన్నారు. అందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఏ ఎమ్మెల్యేకు చెప్పారని అడిగినప్పుడు 21 రోజుల్లో గెలిచిన ఎమ్మెల్యే అని ఆమె చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెప్పగలవా అని బుట్టా రేణుక అడిగినప్పుడు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. మీ సమస్యల పరిష్కారం కావాలంటే వైఎస్సార్సీపీతోనే సాధ్యమవుతుందని బుట్టా రేణుక చెప్పినప్పుడు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పడం విశేషం.
26 ఏడీఎన్ 23 - మాజీ ఎంపీ బుట్ట రేణుకతో తన ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళ
