⇒ ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై దాడి
⇒ సుమారు 100మంది వెళ్లి గ్రామస్తులపై దౌర్జన్యం
⇒ అడ్డుకుంటే తన్ను తామని హెచ్చరిక
⇒ పోలీసుల ముందే దాడులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది.అక్రమ తవ్వకాలు జరపడమే కాకుండా దాడులకు తెగబడుతోంది. తాజాగా ఆమదాలవలస మండలం నిమ్మ తొర్లాడ లో ఇసుక అక్రమ తవ్వకాలను గ్రామస్తులు కొంతమంది అడ్డుకున్నారు.ఎక్కడిక్కడ ఇసుక తవ్వేస్తుండటం వలన నదిలో పెద్ద పెద్ద గోతులు అవడం వలస పశువులు పడి చనిపోతున్నాయి. కొన్ని గాయపడ్డాయి.అలాగే శ్మశాన వాటిక లోనూ, గోవులు మేసే స్థలంలో నూ తవ్వకాలు జరుపుతున్నారు.
వందల లారీలతో ఇసుక తరలిస్తుండటంతో నదితో పాటు రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. ఇసుక అక్రమార్కుల అరాచకాలు చూసి ఆందోళన చెందిన గ్రామస్తులు, మహిళలు, విద్యార్థులు ఇసుక తవ్వకాల నిర్వాహకులను నిలదీయడమే కాకుండా ఇసుక లారీలను, తవ్వకాలు జరిపే జెసిబి లను అడ్డుకున్నారు. దీంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది.
నిరసన తెలిపిన వారు వారి ఇళ్లకు వెళ్లినాక శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి సుమారు100మంది వరకు వచ్చి దాడి చేశారు. కొందరిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు వచ్చినా కూడా ఆగకుండా దాడి చేశారు. దీంతో నిమ్మ తోర్లాడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.ఆమదాలవలస నియోజక వర్గంలో ఇసుక మాఫీయా దాడులు కొత్తకాదు. కొంతమంది గుండాలతో దాడులు చేయించి, ఇసుక అక్రమాలకు అడ్డురాకుండా బెదిరించారు.
కర్రలు తదితర వాటితో దాడి చేయించారు. బూర్జ మండలం నారాయణపురం, పొందూరు మండలం , ఆమదాలవలస మండలం దూసి వద్ద ఇదే రకంగా గతంలో దౌర్జన్యంతో దాడులు చేసారు. అదే ఆమదాలవలస ఇసుక మాఫియా శ్రీకాకుళం నగరంలో కూడా సనపల సురేష్ అనే వ్యక్తిపై నడిరోడ్డు మీద దాడి చేసి ,తన్ని తీవ్రంగా గాయ పరిచారు.
తాజాగా ఆమదాలవలస మండలం నిమ్మతోర్లాడ లో కూడా ఇసుక తవ్వకాలు అడ్డుకున్నారని ఏకంగా గ్రామస్తులపైనే విరుచుకు పడ్డారు. చేతికి దొరికిన వాళ్ళందరిని చావ బాదారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయ పడిన వారిలో వండాన వైకుంఠ రావు, ఇప్పిలి రాజేష్, బోనేల ఈశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఎదుటే దాడికి పాల్పడ్డారు.
ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇసుక తవ్వకాలు, దాడులు జరుగుతున్నాయి. తెరవెనక ఉండి, దౌర్జన్యం చేయించి, భయ బ్రాంతులకు గురి చేసి ఇసుక దోపిడీకి అడ్డు లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.