రాష్ట్ర విభజన వ్యవహారం మరింత ముదిరింది. సమైక్యాంధ్ర కోసం మరోసారి ఒత్తిడి పెరుగుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు పంపించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు తెలిపారు. ముందుగా కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత సంప్రదింపులు జరపాలని బాలినేని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని బాలినేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నిర్ణయం ఏంటో ప్రకటించలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించిందని బాలినేని విమర్శించారు. ఓట్లు... సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ ఆలోచన చేస్తుందన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన పదవికే కాగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. కాగా రాష్ట్ర విభజనపై హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర మంత్రులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తెలంగాణ ఇస్తామంటే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానం ముందు సమైక్యవాణి గట్టిగా వినిపించాలని భావిస్తున్నారు. అందుకోసం ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయల్దేరుతున్నారు.