ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు హద్దులు మీరారు. పూటుగా గంజాయి సేవించి వీరంగం చేశారు. మత్తెక్కిన మైకంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించారు. తూగుతూ, ఊగుతూ సరాసరి లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించారు. అక్కడున్న విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఏయూ చరిత్రలోనే తొలిసారిగా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి, అధ్యాపక వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. అప్రమత్తమై న యాజమాన్యం ఆ విద్యార్థులను సస్పెండ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు.