పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రజలకు మరిన్ని ఉపశమన చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా పెళ్ళిళ్ల సందర్భంగా ఇబ్బందుల కుటుంబాలకు, రైతులకు ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఆర్థిక శాఖ తీసుకున్న చర్యల గురించి మీడియాకు వివరించారు. రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్బంగా కొన్ని వెసులు బాట్లను, మరిన్ని మార్పులను వెల్లడించారు. నగదు మార్పిడిలో ఈ కొత్త నిబంధన నవంబరు 18 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ వర్గాలనుంచి వచ్చిన విజ్ఞప్తు లమేరకు ఆ యా కుటుంబాల నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నామన్నారు. వివాహాల కోసం రూ.2.5లక్షల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.