దేశ విదేశాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బైర్రాజు రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఆయన సోదరుడు రామరాజుకు కూడా ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 5 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మొత్తం పది మంది దోషులు ఉన్నారు. మొత్తం ఎవరెవరికి ఎంతెంత జైలుశిక్ష, జరిమానా అనేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. మొదటి దోషి రామలింగరాజు కావడంతో ఆయన మీద తీర్పు వెలువడింది. ఇప్పటికే ఆయన 33 నెలల పాటు రిమాండు ఖైదీగా ఉన్నారు కాబట్టి మిగిలిన కాలానికి ఆయన జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. హైకోర్టులో మాత్రమే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం. ఉంది. ఆయనతో పాటు మొత్తం పది మంది దోషులకు కూడా ఏడేళ్ల జైలుశిక్షనే విధించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు మినహా మిగిలిన దోషులకు మాత్రం రూ. 25 లక్షల చొప్పున జరిమానా విధించారు. దోషులను నేరుగా కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలించే అవకాశం ఉంది.