పదికోట్లమంది తెలుగువారి హృదయాల్లో వైఎస్ఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట సర్కిల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆకస్మిక మృతిని తెలుగువారు ఇప్పటికీ జీర్ణించుకోలేకుండా ఉన్నారని, వైఎస్ లేని లోటు పూడ్చటం ఎవరి తరం కాదన్నారు. అన్నివర్గాలకు కూడా సమానమైన, నమ్మకమైన నాయకత్వం ఇచ్చిన నేత వైఎస్ఆర్ అని అన్నారు. ఓటమిలోనూ, విజయంలో వైఎస్ఆర్ ఎప్పుడూ కాంగ్రెస్లోనే ఉన్నారని, ఆయన బాటలోనే తాము ముందుకు వెళతామని రఘువీరా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు మరవలేనివన్నారు. ఆయన సేవలను పొన్నాల గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షులతో పాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.