శ్రీహరికోట (సూళ్లూరుపేట): పూర్తిస్థాయి స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1 హెచ్ ఉపగ్రహాం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయం త్రం 7 గంటలకు ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్ ద్వారా ప్రయోగించారు. బుధవారం రాకెట్ నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపిన శాస్త్రవేత్తలు, గురువారం రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. అనంతరం రాకెట్‌కు తుదివిడత తనిఖీలు నిర్వహించి హీలియం, నైట్రోజన్ గ్యాస్ నింపే పనులను పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి పీఎస్‌ఎల్‌వీ సీ–39 ద్వారా 1,425 కిలోల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు.