‘ఓటుకు కోట్లు’ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిన మరుక్షణమే ఈ నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఈ వ్యవహారంలో తమకు అందిన వీడియో, ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితుల స్వర నమూనాలను తీసుకోవాలని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్ణయించింది. వారి స్వర నమూనాలను ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఎస్‌ఎల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నమూనాలు తీసుకున్న 24 గంటల్లోనే ఎఫ్‌ఎస్‌ఎల్ తమ నివేదికను కోర్టుకు అందజేసే అవకాశం ఉంది. ఆ వెంటనే చంద్రబాబు సహా పలువురు ‘కీలక’ వ్యక్తులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.