భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి.. రాష్ట్రంలో వర్షాలపై సమీక్ష జరిపారు. మంత్రులందరితో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్‌ఎంసీ క మిషనర్ జనార్దన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులతో మాట్లాడారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు.