డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. పెట్రోలు బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలపై ఒక శాతం లావాదేవీ పన్ను విధించాలన్న నిర్ణయంతో బంకుల యాజమాన్యాలు మండిపడ్డాయి. ఇక మీదట డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు, డీజిల్ అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించాయి. సోమవారం నుంచే దీన్ని అమలుచేస్తామని చెబుతున్నాయి. దీంతో ఒక్కసారిగా వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇస్తున్న పీఓఎస్ మిషన్లను వాడే బంకుల నుంచి ఈ ఒక్కశాతం లావాదేవీ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం బంకుల తాజా నిర్ణయానికి కారణమైంది.