● ప్రజలకు పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి
● వైఎస్ఆర్సీపీ కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి ఖరారు
కడప కార్పొరేషన్ : ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి స్థానిక ఎన్నికల రూపంలో ప్రజలకు మంచి అవకాశం లభించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ జెడ్పీ చైర్మన్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహా రెడ్డి, కమలాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా మారుజోళ్ల కవితలను ఎంపిక చేశామని వెల్లడించారు.
మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు
ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతు కూలీలు, అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా పాలన సాగిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిందని ధ్వజమెత్తారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పుడు హామీలిస్తే ప్రజ లు గుణపాఠం నేర్పుతారనే భయం ఉంటే భవిష్యత్తులో ఎవరూ ఇలా బూటకపు హామీలు ఇవ్వరని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఎస్. యానా దయ్య, మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, షేక్ ఉమైర్, సీహెచ్ వినోద్, అక్బర్ అలీ, షఫీ, షఫీవుల్లా పాల్గొన్నారు.


