సాక్షి ప్రతినిధి, కడప: స్థానిక ఎన్నికలకు సైరన్ మోగడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో అధికార పక్షం అభ్యర్థుల ఎంపికల్లోనే మల్లగుల్లాలు పడుతుంటే.. వైఎస్సార్సీపీలో ఐక్యతా రాగం కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య కలహాల కాపురం నడుస్తోంటే.. ‘ఫ్యాను’ పార్టీలో స్పీడు జోరందుకుంది. ఇప్పటివరకు కూటమి నుంచి ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక వైఎస్సార్ సీపీ కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థితో పాటు పులివెందుల, బద్వేలు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి మున్సిపల్ చైర్మన్లను ప్రకటించి దూసుకుపోతోంది. పైగా ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులందరిపై పార్టీ నేతలందరిలో సాను కూలత.. ఐక్యత ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.


