కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సభాభవన్లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డీఆర్వో మల్లికార్జునుడు, ఏఎస్పీ ప్రకాశ్బాబు, కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, జిల్లా పంచాయతీ అధికారి రామచంద్ర ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు.
పంచాయతీ ఎన్నికలకు 11.70 లక్షల ఓటర్లు
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు 11,70,375 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో 5,74,609 మంది పురుషులు, 5,95,707 మంది మహిళలు, 59 మంది ఇతరులు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా ఎస్టీలు 28,581 మంది, ఎస్సీలు 2,18,487 మంది, బీసీలు 4,97,414 మంది, ఓసీ, ఇతర వర్గాలకు చెందిన వారు 4,25,893 మంది ఉన్నట్లు వివరించారు. ఓటర్ల జాబితాల తయారీకి 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలోని 619 గ్రామ పంచాయతీలకు సుమారు 5,930 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాల కారణంగా గతంలో ఎన్నికలు జరగని సి.గోపులాపురం, నూకినేనిపల్లి, టి.సుందుపల్లి, ఏడిగపల్లి గ్రామ పంచాయతీలకు కూడా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, శిక్షణ, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వంటి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయాన్ని తప్పనిసరిగా పాటించాలని, అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు
ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,000 మంది ఓటర్లకు అవకాశం కల్పించాలని, కనీసం 20 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న భవనాలను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవసరమైన సమావేశాలు నిర్వహించి, వాటి వివరాలను, చర్చించిన అంశాలను, నిర్ణయాలను తప్పనిసరిగా సమావేశపు మినిట్స్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సామగ్రి, సిబ్బంది నియామకం
ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పెట్టెల లభ్యతపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని, అదనపు పెట్టెల కోసం ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బంది నియామకానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


