స్థానిక సమరం | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరం

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

● వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ అభ్యర్థుల

జాబితా విడుదల

ప్రొద్దుటూరు: పోరెడ్డి నరసింహారెడ్డి ప్రొద్దుటూరు, నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్‌ నేత పోరెడ్డి నరసింహారెడ్డి పేరును ప్రొద్దుటూరు అభ్యర్థిగా ఖరారు చేశారు. 1985, 1995లో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జమ్మలమడుగు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఓదార్పు, పాదయాత్రల్లో చురుగ్గా పాల్గొన్నారు. గతంలో టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేయడంతో వ్యాపార వర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈయన భార్య పేరిట ఉన్న సుజాత ట్రస్టును 2021లో వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. కూటమి నుంచి ఎవరు వచ్చినా పోరెడ్డి విజయం ఖాయమనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి.

బద్వేలు అర్బన్‌ : బద్వేలు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయిక్రిష్ణ పేరును ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, యువనేత దేవసాని ఆదిత్యరెడ్డిలు ఖరారు చేశారు. ఆర్‌.వి.సాయిక్రిష్ణ 2008, 2014లలో బద్వేలు కౌన్సిలర్‌గా, 2021లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన తండ్రి దివంగత రాచపూడి నాగభూషణం సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా సేవలందించారు. మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా ఐకమత్యంతో ఎదుర్కొంటామని నేతలు భరోసా ఇచ్చారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఆర్‌.వి.సాయిక్రిష్ణను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మాజీ కుడా చైర్మన్‌ గురుమోహన్‌, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు బంగారుశీనయ్య, అల్లాబకాష్‌, యద్దారెడ్డి, పుత్తాశ్రీరాములు, రమేష్‌బాబు, ఎంఆర్‌ఎఫ్‌రమణారెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, టి.వెంకటసుబ్బయ్య, చెన్నయ్య, మౌలాలి, గంగిరెడ్డి, రామచంద్రనాయుడు, రాజేష్‌, గురివిరెడ్డి, సుబ్బరాజ తదితరులు పాల్గొన్నారు.

కమలాపురం: మారుజోళ్ల కవిత

కమలాపురం: కమలాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా మారుజోళ్ల కవిత పేరును పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి ఖరారు చేశారు. బుధవారం వార్డుల నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కవిత భర్త రఘునాథరెడ్డి, బావ శ్రీనివాసరెడ్డి (ప్రస్తుత మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌), వారి బలమైన బంధుగణం పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. కె.అప్పాయపల్లెకు చెందిన కవిత బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుజోళ్ల కవిత అభ్యర్థిత్వం ద్వారా విజయం నల్లేరుపై నడకేనని అందరి అభిప్రాయం మేరకు రవీంద్రనాథ్‌ రెడ్డి ఆమెను ఎంపిక చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం పూరించింది.ముగ్గురు నేతలను మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులుగా అధిష్టానం అధికారికంగా బరిలోకి దించింది. ప్రొద్దుటూరు, బద్వేలు, కమలాపురం మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement