కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ఒరిజినల్ బాండ్ల స్వీకరణ ప్రక్రియ మూడో రోజు మంగళవారం కొనసాగింది. సీఐడీ డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీఐలు రారాజు , అరుణ్ రెడ్డి వీరబల్లి మండలానికి చెందిన 108 మంది బాధితుల నుంచి అధికారులు ఒరిజినల్ బాండ్లను స్వీకరించారు. బాధితులు సమర్పించిన బాండ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. మంగళవారం బాండ్లను సమర్పించలేకపోయిన సిద్ధవటం, వల్లూరు. వీరబల్లి మండలాలకు చెందిన బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరో అవకాశం కల్పిస్తామ ని వివరించారు. సంబంధిత బాధితులు తమ వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్లతో హాజరై వాటిని సమర్పించవచ్చని సూచించారు.
కమాండ్ అండ్ కంట్రోల్
సెంటర్ ప్రారంభం
పులివెందుల : పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెల్ప్‌లైన్ నెంబర్‌ను మంగళవారం ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను, అత్యవసర సమాచారాన్ని పోలీసులకు తెలియజేసేందుకు 9490864264 హెల్ప్‌లైన్ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, అర్బన్ సీఐ పురుషోత్తమరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
మదనపల్లె సిటీ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష (2026–27)కు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. నవంబర్15న జరగాల్సిన పరీక్షను నవంబర్ 29వతేదీకి మార్చినట్లు చెప్పారు. అలాగే ప్రింటెడ్ నామినల్ రోల్, ఒరిజనల్ ఎస్‌బీఐ కలెక్ట్ రసీదును సంబంధించిన డీఈఓ కార్యాలయంలో ఈనెల 28లోపు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి లాగిన్‌లో దరఖాస్తుల ధ్రువీకరణకు ఈనెల 29నతేదీ వరకు గడువు ఉందని వివరించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం
గాలివీడు : మండల రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎగువగొట్టివీడులో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణాన్ని మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన అధికారి అరవింద్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ‘ఎగువగొట్టివీడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఢిల్లీ లిమిటెడ్’ ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, డ్రిప్ పరికరాలు, విత్తనాలు, ఎరువులు సరసమైన ధరలకు అందిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వ సహకారంతో మామిడి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులతో పాటు ఆర్గానిక్ ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు, పశువుల దాణా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అరవింద్ కుమార్ సింగ్‌ను కో ఆర్డినేటర్ వెంకటరమణ సిబ్బంది సన్మానం చేశారు. ఈ సమావేశంలో బీఓడీ చిన్నరెడ్డప్ప నాయుడు, మల్లికార్జున నాయుడు,సీఈఓ ప్రసాద్, అకౌంటెంట్ హేమకుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు 103 కొత్త బస్సులు
పీలేరురూరల్ : జిల్లాకు కొత్తగా 103 ఆర్టీసీ బస్సులు మంజూరైనట్లు డీపీటీఓ శశిభూషణ్ అన్నారు. మంగళవారం ఆయన పీలేరు డిపోను, గ్యారేజ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె డిపోకు 50, రాయచోటికి 53 కొత్త బస్సులు వస్తాయని పేర్కొన్నారు. రెండో విడతలో పీలేరు డిపోకు కొత్త బస్సులు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించి, ప్రయానీకులకు మెరుగైన సేవలందించడానికి కొత్తగా 1450 ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులు రానున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 499 బస్సులతో ప్రజా రవాణా సేవలు అందిస్తున్నామని వీటిలో 370 ఆర్టీసీ, 129 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోజుకు 19.70 లక్షల కిలోమీటర్లు రూ. 9.42 కోట్లు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. డీఎం ఎస్.ఎం.డి. రోషన్‌బాషా, ఎంఎఫ్ ఫణిభూషణ్ నాయక్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


