అధికార బలం.. అక్రమ తవ్వకం! | - | Sakshi
Sakshi News home page

అధికార బలం.. అక్రమ తవ్వకం!

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

●విధ్వంసమవుతున్న ప్రభుత్వ వ్యవస్థలు

● గుర్రంగంపు రిజర్వాయర్‌లో

యథేచ్చగా మట్టి దోపిడీ

● రూ.కోట్లలో సంపాదన

● హిటాచీలు, టిప్పర్లతో

ప్రత్యేక దారులు ఏర్పాటు

● జిల్లా కేంద్రానికి ఆనుకునే జాతీయ

రహదారులపై రవాణాతో దందా

భారత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న వెంచర్‌కు

టిప్పర్లతో తోలుతున్న మట్టి

గుర్రంగుంపు రిజర్వాయర్‌లో హిటాచీలతో అక్రమ మట్టి తవ్వకాలు

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌ : ప్రజల దాహార్తిని తీర్చాల్సిన, రైతులకు సాగునీరు అందించాల్సిన గుర్రంగుంపు (జీఎన్‌ఎస్‌ఎస్‌) రిజర్వాయర్‌ ఇప్పుడు మట్టి, గ్రావెల్‌ మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. జలాశయంలో నీరు తగ్గడమే ఆలస్యం.. మైనింగ్‌ మాఫియా నీటి అడుగున ఉన్న మట్టి, గ్రావెల్‌ను దోచుకోవడానికి వాలిపోతోంది. ఇక్కడ జరుగుతున్నది కేవలం తవ్వకాలు మాత్రమే కాదు... పట్టపగలు ప్రభుత్వం కళ్లముందే సాగుతున్న సహజ వనరుల దోపిడీ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రెండు హిటాచీలు, పదుల సంఖ్యలో టిప్పర్లు, మందీమార్బలంతో ఇది మట్టి తవ్వకాలా లేక రణరంగమా అనేలా ఉంది. అనుమతులు, సీనరేజి, పర్యావరణ క్లియరెన్సులు ఏవీ లేకపోయినా, కేవలం ‘పైనుంచి’ఉన్న కనిపించని సిగ్నల్‌తో ఈ దందా గత కొద్ది రోజులుగా సాగుతోంది.

రాజమార్గంలోనే రవాణా!

ఈ మట్టి దోపిడీ అదేదో మారుమూల ప్రాంతంలో అడ్డదారుల్లో వెళుతోందనుకుంటే పొరపాటే. టిప్పర్లు దర్జా గా రిజర్వాయర్‌ మట్టి కట్టను తొలగించుకొని లోపలికి వెళ్తూ, వస్తూ రవాణా సాగిస్తున్నాయి. గుర్రంగుంపు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ మీదుగా పవర్‌ గ్రిడ్‌ వద్ద జాతీయ రహదారిపైకి చేరి.. అక్కడనుంచి కడప నగరం వైపు, నగరం చుట్టుపక్కల వెలుస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు ఈ మట్టిని తరలించి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు.

టిప్పర్‌కు రూ. 3,000 ట్యాక్స్‌

ఈ దందాలో ఎవరికై నా ఒకటే రూల్‌. ఒక్కో టిప్పర్‌ మట్టి లేదా గ్రావెల్‌ బయటకు వెళ్లాలంటే అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులకు రూ. 3,000 కప్పం చెల్లించాల్సిందేనని తెలుస్తోంది. ఈ వసూళ్లలో కొందరు అధికారులకు కూడా వాటాలు వెళ్తుండడం వల్లే అంతా చూస్తూ కూడా కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎదురు తిరిగిన వారికి దౌర్జన్యాలు, బెదిరింపులే సమాధానం అవుతున్నాయి. ప్రభుత్వ సొమ్మయిన మట్టిని దోచేసి, అక్రమ లేఅవుట్లను చదును చేయడానికి వాడుకుంటూ కొందరు జేబులు నింపుకుంటున్నారు.

జలాశయాన్ని కాపాడుకుందాం..

గుర్రంగుంపు రిజర్వాయర్‌ భవిష్యత్తులో కడపకు తాగునీరు,చుట్టుపక్కల భూములకు సాగునీరు అందించేందుకు కీలకం. గతంలో లీకేజీలు జరిగినప్పుడు డ్రిల్లింగ్‌ జరిపి, కెమికల్స్‌ వేసి నీటిని వృథా కాకుండా కాపాడారు. అలాంటి రిజర్వాయర్‌ గర్భాన్ని ఇప్పుడు ఇష్టానుసారంగా తవ్వేస్తే.. నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఈ దోపిడీని అడ్డుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన పలు ప్రభుత్వ శాఖలు పూర్తిగా మూగబోయాయి. రిజర్వాయర్‌ తమ పరిధిలోనిదే అయినా ఇరిగేషన్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మైనింగ్‌ అధికారులు ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. అక్రమ వెంచర్లకు మట్టి తరలుతున్నా పంచాయతీరాజ్‌ శాఖ పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారిపైనే దర్జాగా టిప్పర్లు తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల ఈ నిస్సహాయత వెనుక భయముందా? లేక స్వామిభక్తి ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement