ముస్లింల అభ్యున్నతి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

ముస్లింల అభ్యున్నతి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా

● టీడీపీ నుంచి 200 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక

మైదుకూరు : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలకు మేలు జరుగుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా తెలిపారు. మైదుకూరులోని మహబూబ్‌ నగర్‌ ప్రాంతంలో 5, 6, 7 వార్డులకు చెందిన 200 కుటుంబాలు వారు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అంజద్‌బాషా మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం యువత ఇంజినీర్లు, డాక్టర్లు అయ్యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి విదేశీ విద్య కోసం కూడా ఆర్థిక సాయం అందించి వారిని ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. మళ్లీ ఇవన్నీ జరగాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. మైదుకూరులో రాబోవు మున్సిపాలిటీ ఎన్నికల్లో 32 వార్డుల్లో కౌన్సిలర్లుగా, చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పథకాల సొమ్ము ఇవ్వాలని అడగండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన టీడీపీ వారిని నిలదీయాలని, పథకాల సొమ్ము ఇస్తేనే ఓట్లు వేస్తామని చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్‌, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఆ మొత్తం ఇవ్వకపోతే చాట, పొరకలను తిరిగేయాలన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లంటూ మభ్యపెట్టి ఒకటి రెండు కూడా ఇవ్వలేదన్నారు. తప్పు చేసిన కూటమికి దండన వేయాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే 2029లో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికినట్టు అవుతుందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పండి

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఏది కొనలేని పరిస్థితి ఉందన్నారు. ఈ దుస్థితికి కారణమైన చంద్రబాబును, వారి నాయకులను నిలదీయాలని అన్నారు. వారిని ఓడిస్తేనే వాళ్ల తప్పులు తెలుస్తాయని, ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే వచ్చే 30 నెలల్లో ఇంకా మోసం చేస్తారని తెలిపారు. మైదుకూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈవీఎంలతో మోసం చేసి కూటమి పార్టీలు గెలిచాయని, ఇప్పుడు బ్యాలెట్‌లో వారిని ఓడిస్తే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఉంటే వైఎస్సార్‌సీపీ గెలిచి ఉండేదని అందరికీ తెలుస్తుందన్నారు.

బీసీలను మోసం చేసిన చంద్రబాబు

రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలోని బీసీలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని తెలిసినా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రకటించారని అన్నారు. సుప్రీంకోర్టు కొట్టి వేస్తుందని తెలిసినా సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని విమర్శించారు. ఇది బీసీలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. మైదుకూరు మున్సిపాలిటీలో వైఎస్‌ జగన్‌ పాలనలో అమ్మ ఒడి కింద 5397 మందికి రూ.22.26 కోట్లు, విద్యాదీవెన కింద రూ.12.18 కోట్లు అందించామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.28 కోట్లు, రూ.58.60 కోట్ల పింఛన్‌ సొమ్ము ఇంటి వద్దకే వెళ్లి అందించామని వివరించారు.

200 కుటుంబాలు చేరిక

పట్టణంలోని మహబూబ్‌ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 5, 6, 7 వార్డులకు చెందిన 200 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మూడు వార్డులకు చెందిన జనతా బాషా, మహబూబ్‌ బాషా తదితరులకు పార్టీ కండువాలను వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డుల నాయకులు జమాల్‌ బాషా, వైఎస్‌ గౌస్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మదీనా దస్తగిరి, నేట్లపల్లె శివరాం, పార్టీ పట్టణాధ్యక్షుడు కేపీ లింగన్న, మండల కన్వీనర్‌ గల్లా నరసింహారెడ్డి, సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఊటుకూరు రఘురామిరెడ్డి, పొలిమేర అమర్‌నాథ్‌రెడ్డి, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement