నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 12వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్‌ చేసి తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీ దష్టికి తీసుకురావచ్చు.వినియోగదారులు తమ వద్ద విద్యుత్‌ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

సర్కిల్‌ స్థాయిలోనూ డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్‌ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు శ్రీడయల్‌ యువర్‌ ఎస్‌ఈశ్రీకార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్‌ సమస్యలను 08562242457 నంబర్‌కు ఫోన్‌ చేసి సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ దృష్టికి తీసుకురావచ్చని అధికారులు తెలిపారు.

బాధ్యతల స్వీకరణ

కడప అర్బన్‌: కడప పోలీస్‌ సబ్‌ డివిజన్‌ నూతన డీఎస్పీగా టి.భవాని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సబ్‌ డివిజన్‌ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమాచారమున్నా ప్రజలు నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. త్వరలోనే పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన టి.భవాని బీటెక్‌ పూర్తి చేసి మొదట సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం గ్రూప్‌–2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికై చాపాడు మండలంలో రెండేళ్లపాటు విధులను నిర్వహించారు. అనంతరం 2023లో గ్రూప్‌–1 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీగా తొలి పోస్టింగ్‌ ముగించుకుని, బదిలీపై ప్రస్తుతం కడప డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

ఏకగ్రీవంగా ఎన్నిక

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు జిల్లా తూర్పు యడవల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్‌, జనరల్‌ సెక్రటరీగా ఎం.డేనియల్‌ ప్రదీప్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికై న శ్రీధర్‌, డేనియల్‌లు మాట్లాడుతూ ఫుట్‌బాల్‌ క్రీడను నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

నేడు ‘పీజీఆర్‌ఎస్‌’

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌ సభాభవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్లు డీఆర్వో మల్లికార్జునుడు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మండల, మున్సిపల్‌ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలతో హాజరై వినతిపత్రాలు సమర్పించాలని కోరారు. అలాగే గతంలో సమర్పించిన అర్జీల వివరాలు తెలుసుకోవడానికి 1100 కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.

ముగిసిన రెవెన్యూ స్పోర్ట్స్‌ మీట్‌

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, ఐక్యతను పెంపొందించడానికి ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం విజేతలకు డీఆర్‌ఓ ట్రోఫీ అందించారు. కడప డివిజన్‌, కలెక్టరేట్‌, జమ్మలమడుగు, రాజంపేట తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు పోటీల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పారు. క్రికెట్‌లో కడప డివిజన్‌ జట్టు విజేతగా, కలెక్టరేట్‌ జట్టు రన్నరప్‌ప్‌గా నిలిచాయి. నరేంద్ర ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా, శరత్‌ బెస్ట్‌ బ్యాటర్‌గా, ప్రవీణ్‌ బెస్ట్‌ బౌలర్‌గా నిలిచారు.బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, చెస్‌, క్యారమ్స్‌, టెన్నికాయిట్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శివరామిరెడ్డి, రంగస్వామి, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు రోనాల్డ్‌ శామ్యూల్‌రాజ్‌, కార్యదర్శి ప్రసాద్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement