● గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమణ పనులు
● రాజంపేట, నందలూరులో కబ్జాకు యత్నం
● ప్రైవేటు స్థలాన్ని కూడా వదలని టీడీపీ వర్గీయులు
రాజంపేట : కూటమి ప్రభుత్వ పాలనలో రాజంపేట, నందలూరు మండలాల్లో ఖాళీగా భూములు కనిపిస్తే.. పచ్చ నేతలు పాగా వేస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ముందుగా నెమ్మ.. నెమ్మదిగా పనులు చేస్తుంటారు. ఆ తర్వాత పర్మినెంట్‌గా తమదే అనిపించే విధంగా కంచె వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే ఆక్రమించుకోవాలన్న భూమి గురించి, తమకు అనుకూలమైన రెవెన్యూ అధికారుల ద్వారా పూర్తి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా కబ్జా అనేది అసాధ్యమని రెవెన్యూ శాఖకు చెందిన కొంత మంది నిజాయతీ అధికారులు అంటున్న మాట. ప్రస్తుత కడప–రేణిగుంట జాతీయ రహదారి పక్కన ఏ శాఖకు చెందిన భూమి అయినా సరే ఖాళీగా ఉంటే దానిని పచ్చనేతలు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఎవరైనా అడిగితే పట్టా ఉందనో, పాత కాలం నుంచి తమకే ఉందనే ఇలా సమాధానం చెప్పుకొని ఆక్రమమణ పర్వం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ భూమి ఆనుకొని..
కడప–రేణిగుంట జాతీయ రహదారి (పాతది) పక్కన ఉన్న స్థలాన్ని ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ వర్గీయుడు చదును చేసిన అంశం నందలూరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఖాళీగా కనిపించే సరికి ఒంటమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేత అనచరుడు ఒకరు ఈ స్థలాన్ని చదును చేసుకున్నట్లుగా, అందులో బోరు, గది నిర్మాణం కూడా చకచకా చేపట్టినట్లు కనిపిస్తోంది. అది ప్రభుత్వ భూమి అని, ఒంటిమిట్ట మండల రెవెన్యూ పరిధిలోకి వస్తుందని అనుకొని టీడీపీ వర్గీయుడు గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేసుకోవడం గమనార్హం.
నందలూరు ఆర్‌ఐ ఏమంటున్నారంటే..
ఆల్వీన్ శివారులో స్థలం చదను సమాచారం తెలిసి నందలూరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుశీల్ కూడా ఇటీవల పరిశీలించారు. చదును చేసిన భూమి మూతపడిన ఆల్వీన్ పరిశ్రమకు సంబంధించినది, వారికి కూడా సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్కడ ఎవరికీ పట్టాలు లేవని కూడా స్పష్టం చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, సమీపంలో మండల సరిహద్దురాయి కూడా ఉందని వివరించారు.
రాజంపేట గడేరుపల్లెలో కొండకు ఎసరు..
నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట మండలం గడేరుపల్లె(శేషన్నగారిపల్లె)లో ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూమిని టీడీపీకి చెందిన బాబు సామాజిక వర్గ టీడీపీ వర్గీయులు దర్జాగా కబ్జాకు దిగారు. ఏకంగా కొండకు ఎసరు పెట్టారు. 831 బ్లాక్ నంబరులో చదును చేసుకున్నారు. ఇందుకు ఓ రెవెన్యూ అధికారికి చేయి తడిపినట్లుగా తెలిసింది. ఈ విధంగా లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తున్నా.. పట్టించుకునే రెవెన్యూ అధికారులు కరువయ్యారు. దీంతో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణల వ్యవహారం స్థానికులకు తెలిసినా, అధికారులకు చెప్పినా.. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న భావనలో రైతులు ఉండిపోతున్నారు.


