మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె చెరువులో ఓ వ్యక్తి వ్యవసాయ బోరును వేయించాడు. సమీపంలోని తన పొలంలో సాగు చేసి పంటలకు నీరు అందించేందుకు ఏకంగా చెరువులోనే బోర్ వేయించాడు. ఈ విషయమై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాలతో వీఆర్‌ఏ సురేష్ కుమార్ చెరువు వద్దకు చేరుకొని బోరును సీజ్ చేసి, ముళ్లకంపను వేశారు.
కేసు నమోదు
కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం కనం దగ్గర ఎస్సీ కాలనీ ఎదురుగా జాతీయ రహదారిలో ఇటీవల ముచ్చుమర్రి శివారెడ్డి, పొట్టిపాడు గ్రామానికి చెందిన దుగ్గయ్య గారి బలరామిరెడ్డి ద్విచక్రవానంలో వస్తుండగా.. ఎదురుగా మరో ద్విచక్రవాహనం వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు తగిలినట్లు పోలీసులు తెలిపారు. దుగ్గయ్య గారి అమరసింహారెడ్డి ఆదివారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్‌ఐ హాజి బాషా తెలిపారు.
అదుపు తప్పిన కారు
చింతకొమ్మదిన్నె : కడప– చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం కొత్త రోడ్డు సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా ట్రాక్టరు, కారు ఢీకొనడంతో.. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కారు కడప వైపు వస్తుండగా, కడప వైపు నుంచి వెళుతున్న ట్రాక్టరును తప్పించే క్రమంలో.. కారు అదుపు తప్పి ట్రాక్టరును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నిమ్మతోటలోకి దూసుకెళ్లింది. కారు ముందు, వెనుక దెబ్బతినగా, అందులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. తమకు ఫిర్యాదు అందలేదని, గాయపడ్డ వారి వివరాలు తెలియ రాలేదని చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని మహిళ మృతి
కలికిరి : కలికిరి రైల్వేస్టేషన్ పరిధిలోని రెండవ ప్లాట్‌ఫామ్‌పై గుర్తుతెలియని మహిళ ఆదివారం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై సుమారు 45 ఏళ్ల వయసు ఉన్న మహిళ అచేతన స్థితిలో ఉండేది. అటుగా వెళ్లే వారు ఇచ్చే ఆహారం తింటూ ఉండేది. ఆదివారం ఉదయం ఆమె కదలకుండా ఉండటంతో అటుగా వాకింగ్ వచ్చిన వ్యక్తులు గమనించి, రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.


