● రైతు సమస్యలను పట్టించుకోని
కూటమి ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు కాటకాలు, అకాల వరదలు సంభవించి పంట నష్టం తీవ్రంగా జరుగుతుందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డితో కలిసి వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, వర్షాభాల పరిస్థితులు నెలకొంటాయని వాతావరణశాఖ పదేపదే చెబుతున్నా చంద్రబాబు సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టడంలో తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 56 శాతం లోటు వర్షపాతం ఉందని, జిల్లాలో 288 మండలాలకుగాను 228 మండలాలలో వర్షపాతమే లేదన్నారు. 92 శాతం వరకు కృష్ణా జలాలు తెలంగాణకే తరలిపోతున్నాయన్నారు. దీంతో రాయలసీమ ప్రజలకు సాగునీరు కాదుకదా తాగునీరు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని, పశువులకు పశుగ్రాసం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ పరిధిలో 90 వేల ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటల సాగుపై ఆందోళన నెలకొందన్నారు. గతంలో వైఎస్‌జగన్ ప్రభుత్వం ఎకరాకు రూ. 15 వేలు చొప్పున పరిహారం ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంపై ప్రభు త్వంలో ముందస్తు ప్రణాళిక కొరవడిందన్నారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఉచిత పంటలబీమా, కనీస మద్ద తు ధర అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు రైతులంతా కృషి చేయాలన్నారు. రైతు విబాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


