రాజంపేటలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ స్కాం | - | Sakshi
Sakshi News home page

రాజంపేటలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ స్కాం

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

లబోదిబోమంటున్న బాధితులు

తమ్ముళ్ల జేబుల్లోకి సహాయ నిధులు

కమీషన్‌ కోసం ముఠాగా నాయకులు

టీడీపీ ముఖ్య నేత అనుచరుల మోసం

రాజంపేట : రాజంపేట నియోజకవర్గంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ స్కాం విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీఎంఆర్‌ఎఫ్‌తో లబ్ధి పొందేందుకు టీడీపీలో ఒక టీం ఇదే పనిలో ఉంది. తమ్ముళ్లకు ఇప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌ ఒక ఉపాధి వనరుగా మారిందన్న విమర్శలు బాధితుల నుంచి వెలువడుతున్నాయి. మంచానికి పరిమితమైన, ప్రమాదానికి గురైన, శ్రస్తచికిత్స పొందిన వారు.. ఇలా సీఎంఆర్‌ఎఫ్‌ పొందేందుకు అర్హులైన వారిని ఆ టీం గుర్తిస్తోంది. తర్వాత వారి చెంతకు చేరి మీకు సాయం చేస్తామని మభ్యపెట్టి వారి వద్ద నుంచి సహాయం మంజూరుకు అవసరమయ్యే పత్రాలు తీసుకొని, ముఖ్యనేత సిఫార్సు తదితరం పూర్తి చేసుకొని సీఎంవోకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి మంజూరుకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంటారు. ఇలా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ్ముళ్లు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకొంటున్నట్లు కూటమి వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. నందలూరులోనే కాకుండా పలు మండలాల్లో కూడా సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు వ్యవహారంలో కమీషన్ల పర్వం, బాధితులకు బురిడీ, మోసాలు జరిగినట్లుగా సీఎంవో కార్యాలయానికి ఫిర్యాదులు చేసేందుకు కూటమి పార్టీలలో ఓ వర్గం సిద్ధమైనట్లు తెలిసింది.

స్కాం ఇలా..

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద సహాయం అందజేసేందుకు బాధితునికి సంబంధించి బిల్లులు తదితర ధ్రువీకరణ పత్రాలతో సీఎంఓ కార్యాలయానికి నియోజకవర్గ ముఖ్యనేత సిఫార్సు ద్వారా సీఎంవోకు చేరుతుంది. అక్కడి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఇది జరుగుతున్న ప్రక్రియ. రాజంపేటకు చెందిన ఒకరు ఇప్పుడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా బాధితునికి ఆర్థిక సహాయం చేసే విషయంలో సీఎంవో నుంచి మంజూరు చేయించేందుకు వచ్చిన మొత్తంలో కమీషన్‌ పేరిట దగ్గరుండి బాధితుని నుంచి వసూలు చేసుకుంటున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ వచ్చేందుకు సీఎంవో కార్యాలయంలో చేతివాటం ప్రదర్శించే ఓ అధికారి ద్వారా అధికంగా మంజూరు చేయించేందుకు, ఈ స్కీంలో పట్టు సాధించిన రాజంపేటకు చెందిన వ్యక్తి ఒకరు ఇప్పుడు కీలకంగా పని చేస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ముఖ్యనేత సన్నిహితుడే. మంజూరు అయిన తర్వాత స్థానిక టీడీపీ నాయకులు(ముఖ్య నేత అనచరులు) ఫాలో అప్‌ చేసి రిలీఫ్‌ ఫండ్‌ను పంచుకుంటున్నారు. బాధితుడు నిరక్షరాస్యుడైతే ఇంకా పని సులువు. బాధితునికి మంజూరు చేస్తామని ముందుగానే కమీషన్‌ ఒప్పందంతో ముందుకెళుతున్నారు.

హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం

తాజాగా నందలూరు మండలంలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని నెలల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్సకు సంబంధించి ఆర్థిక సాయాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పొందాలనుకున్నారు. ఈ వ్యక్తికి ముఖ్య నేత ముఖ్య అనుచరులు మోసం చేశారు. స్థానిక బ్యాంకులో బాధితుడి అకౌంట్‌లో రూ.14 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా జమ అయింది. ఈ విషయం తెలియని బాధితుడిని బ్యాంకుకు పిలిపించారు. నిధులు డ్రా చేసుకునేందుకు అవసరమైన సంతకాలు చేసుకున్నారు. ముఖ్యనేత అనచరుడు ఒకరి అకౌంట్‌కు రూ.8 లక్షలు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. మిగిలిన మొత్తం బాధితుని అకౌంటలో రూ.6 లక్షలు నిల్వ ఉంది. ఇది తెలియక, తన సెల్‌ మెసేజ్‌ వచ్చాక.. ఇంటికి వెళ్లాక అసలు విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. తాను తమ్ముళ్ల చేతిలో మోసపోయాననే బాధతో అందరికీ తనకు జరిగిన అన్యాయాన్ని షేర్‌ చేసుకోవడంతో వ్యవహారం బట్టబయలైంది. ఈ మోసానికి పాల్పడిన వారిలో ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఒక నాయకుడు, రాజంపేట టీడీపీకి చెందిన సీఎంఆర్‌ఎఫ్‌ స్కామర్‌ ఒకరు, నందలూరుకు చెందిన ఓ దళిత నాయకుడు ఒకరు, కాపు సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు ఉన్నారని బాధితుడు ఆరోపణలు కూటమి వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అప్పనంగా దోచేందుకు ముఖ్యనేత అనుచరుల వ్యూహం ఫలించింది. ఈ వ్యవహారం నియోజకవర్గ కూటమి నాయకుల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement