● ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ
● గోప్యంగా ఉంచిన అధికారులు
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పరిపాలన గాడి తప్పింది. సోమవారం రాత్రి ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే ఇందుకు నిదర్శనం. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయినా ట్రిపుల్ ఐటీ అధికారులు విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో గందరగోళం నెలకొంది. వివరాలలోకి వెళితే.. సోమవారం రాత్రి ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఒకరికొకరు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకొని దూషించుకున్నారు. దీంతో పెద్ద గొడవకు దారి తీసి హాస్టల్ వసతి భవనంలో ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. అందులో ఒక విద్యార్థి గాయపడటంతో.. తల్లిదండ్రులకు సమాచారం తెలిపారు. మంగళవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ట్రిపుల్ ఐటీకి చేరుకుని డైరెక్టర్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. డైరెక్టర్, పోలీసులు కూర్చొని చర్చించుకుందామని ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. ఒకవేళ తమ విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఎవరు బాధ్యత తీసుకుంటారంటూ అధికారులను, పోలీసులను నిలదీశారు. మందు తాగి మా పిల్లవాడిపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ట్రిపుల్ ఐటీలోకి మందు ఎలా వచ్చింది.. స్టాఫ్ అమ్ముతున్నారా అని అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలా కాకుండా ఇక్కడేమీ జరగలేదని అధికారులు సమస్యలను గోప్యంగా ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని, ట్రిపుల్ ఐటీ అధికారులు నిమ్మకు నీరెత్తుతున్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు విద్యార్థులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇక్కడ ఇదంతా జరుగుతున్న సమాచారం ఎవరికీ తెలపకుండా ఆర్కే వ్యాలీ పోలీసులు, ట్రిపుల్ ఐటీ అధికారులు డైరెక్టర్ చాంబర్‌లోనే పంచాయితీలు చేసి సమస్యలు ఏమి లేవంటూ ఉన్నతాధికారుల దగ్గర గొప్పలు చెప్పుకుంటున్నారంటూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.


